కొడుకు పరీక్ష కోసం సైకిల్‌పై 105 కి.మీ ప్రయాణం...

Man Travelled On a bicycle With Carrying His Son For 105 Kilometers - Sakshi

భోపాల్‌ : ‘పదో తరగతి పరీక్షలు.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి దాదాపు 100 మైళ్లకు పైగా దూరం. లాక్‌డౌన్‌తో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. తన దగ్గర బైక్‌, కార్‌ లాంటి వాహనాలూ లేవు. కానీ చదువు ఎంతో ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. చేసేది ఏం లేక సైకిల్‌పై 105 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష హాల్‌కు చేరుకున్నాడు’. ఇదంతా కొడుకు చదువు కోసం తండ్రి పడిన ఆరాటం. స్వతహాగా తను చదువుకోక పోయినా..కొడుకు అయినా ఉన్నత విద్యావంతుడు కావాలని  ఓ తండ్రి చేసిన ఆలోచన. 15 ఏళ్ల కొడుకును సైకిల్‌పై కూర్చొబెట్టుకొని వంద కిలోమీటర్లు ప్రయాణించి తమ పిల్లల కోసం ఏమైనా, ఎంతైనా చేయగలమని నిరూపించాడు ఆ తండ్రి. (ఫెయిలైన విద్యార్థులంతా పాస్‌)

ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శోభ్రామ్‌ అనే 38 ఏళ్ల వ్యక్తికి పదో తరగతి చదివే కొడుకు ఆశిష్‌ ఉన్నాడు. అతనికి సప్లిమెంటరీ పరీక్షలు దగ్గర పడ్డాయి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బస్సుతో సహా ఎలాంటి రవాణా మార్గాలు అందుబాటులో లేవు. కొడుక్కి ఒక సంవత్సరం వృథా కావొద్దని ఆలోచించిన శోభ్రామ్‌ కొడుకు పరీక్షల కోసం ఆశిష్‌ను సైకిల్‌పై ఎక్కించుకొని 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్ష రాయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.

ఈ విషయంపై శోభ్రామ్‌‌ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. మాకు డబ్బు, ద్విచక్ర వాహనం లేదు. ఈ సమయంలో ఎవరూ సాయం చేయరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలా చేసి ఉండకపోతే నా కొడుక్కి ఒక ఏడాది వృథా అయ్యేది. ఒక రోజు ముందు బయల్దేరి మంగళవారం ధార్‌ చేరుకున్నాము.. మా వెంట అవసరమైన ఆహార వస్తువులు తీసుకెళ్లాము’ అంటూ పేర్కొన్నారు. శోభ్రామ్‌ తన కొడుకు కోసం ఎంతో మంచి పని చేశాడని.. ‘శభాష్‌ శోభ్రామ్‌’‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఒక్క క్ష‌ణం.. అంద‌రినీ పిచ్చోళ్ల‌ను చేశాడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top