నెలసరి దాచిపెట్టిందని విడాకులు

Man Seeks Divorce As Wife Did Not Reveal About Periods On Wedding day - Sakshi

పెళ్లి రోజే నమ్మకాన్ని వమ్ము చేసిందంటున్న భర్త

వడోదర: రుతుక్రమం ఆడవాళ్లకు శాపం కాదని, అది వారి శరీరధర్మంలో ఓ భాగమని మహిళా సంఘాలు చెప్తున్నాయి. కానీ ఓ వివాహిత మహిళకు మాత్రం రుతుక్రమం శాపంగా మారింది. గుజరాత్‌లోని వడోదరలో తన దగ్గర నెలసరి విషయాన్ని దాచిపెట్టిందని భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడో భర్త. అలాగే తన గొంతెమ్మ కోర్కెలు తీర్చడం తన వల్ల కాదంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి, టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళకు నెలసరి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని భర్తకు చెప్పలేదు. తీరా పెళ్లయ్యాక గుడికి వెళ్తుంటే తను లోపలకు రాలేనని అసలు విషయాన్ని చెప్పింది. (చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య)

అలా వాళ్ల మధ్య వాగ్వాదం జరగ్గా ఈ విషయంలో ఆమె మీద నమ్మకం పోయిందని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇంట్లోవాళ్లకు పైసా కూడా ఇవ్వొద్దని పోరు పెట్టేదన్నాడు. కేవలం ఆమె చేతి ఖర్చుల కోసమే ప్రతి నెలా రూ.5 వేలు ఇవ్వాలని, ఇంట్లో ఒక ఏసీ పెట్టించాలని హింసించేదని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, ఆమె చెప్పిన కోరికలను తీర్చడం తన వల్ల కాదని చెప్పడంతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయేదని పిటిషన్‌లో వివరించాడు. చాలాసార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి చిన్నదానికి పుట్టింటికి వెళ్లి సతాయించేందని వాపోయాడు. తను అడిగినవి చేయకపోతే.. నీచంగా బెదిరించేదన్నాడు. ఆమె మాటలను పట్టించుకోకుండా కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ గొడవలు మాత్రం ఆగడం లేదన్నాడు. ఒక రోజైతే టెర్రస్‌ మీద నుంచి దూకి చనిపోతానని భయపెట్టిందని చెప్పాడు. భార్యతో వేగలేనని ఎలాగైనా విడాకులు ఇప్పించమని కోరాడు. (చదవండి: ప్రాణం మీదికి తెచ్చిన ఫేస్‌బుక్‌ ప్రేమ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top