Mumbai: Man dies after helicopter blade falls on his head - Sakshi
Sakshi News home page

వికటించిన ప్రయోగం: హెలికాప్టర్‌ తయారీ.. బ్లేడ్‌ పడి వ్యక్తి మృతి

Aug 11 2021 6:25 PM | Updated on Aug 12 2021 9:23 AM

Man Dies After Helicopter Blade Falls on His Head in Maharashtra - Sakshi

హెలికాప్టర్‌ను తయారు చేస్తున్న షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం (ఫైల్‌ఫోటో)

ముంబై: విమానయానం ఇంకా సామాన్యులకు చేరువకాలేదు. ఆశగా ఆకాశంలోకి చూడటమే తప్ప.. ఆ రెక్కల విహంగంలో ఎక్కి ప్రయాణించడం నేటికి కూడా సామాన్యుడికి తలకు మించిన భారమే. ఈ క్రమంలో ఓ వ్యక్తి తానే హెలికాప్టర్‌ను తయారు చేద్దామని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది.. దాని బ్లేడ్‌ అతడి మీద పడి మరణించాడు. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్ర యావత్‌మాల పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

మహగావ్‌ తాలుకా ఫుల్సవంగా గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి మెకానిక్‌గా పని చేసుకుంటూ ఉండేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి విమానాలు, గాల్లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఈ క్రమంలో ఇబ్రహీం తానే సొంతంగా ఒక హెలికాప్టర్‌ తయారు చేయాలని భావించాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. 

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇబ్రహీం హెలికాప్టర్‌ను పరీక్షిస్తుండగా.. దానిలో తలెత్తిన లోపం వల్ల బ్లేడ్‌ అతడి తలపై పడింది. తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇబ్రహీం మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement