కేరళ: శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Makaravilakku Makara Jyothi Visible For Devotees At Sabarimala - Sakshi

కేరళ: శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో నుంచి భక్తులకు మూడు సార్లు మకరజ్యోతి కనిపించింది. మకరజ్యోతి దర్శనం కాగానే ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణతో శబరిమల సన్నిధానం మార్మోగింది. జ్యోతి దర్శనంతో భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు.

జ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమల తరలివచ్చారు. లక్షలాది అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర సంక్రాంతి పర్వదినాన జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శ్రేణుల నుంచి జ్యోతి దర్శనమైంది. కాగా శబరిమలకు ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నంబలమేడు కొండలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో.. 18 కొండల మధ్య అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top