తిరువనంతపురం: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు సంబంధించి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన వెల్లడించింది. మకరవిళక్కు(మకరజ్యోతి) పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని తాజాగా బోర్డు సమావేశంలో నిర్ణయించింది. భక్తుల దర్శనాలకు సంబంధించిన బుకింగ్స్ నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 70,000 మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 20,000 మంది భక్తులు దర్శనం కోసం స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు అని పేర్కొంది.
ఇక, అయ్యప్ప భక్తులు ఏటా 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు దీక్షను విరమిస్తారు. తన భక్తులను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే స్వయంగా మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్మకం. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలిగి, నేరుగా భగవంతుడిని చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడని నమ్ముతూ ఉంటారు. ఇక రామాయణంలో కూడా శబరిమల ప్రస్తావన ఉండటం గమనార్హం. రాముడు పంబా నదీ తీరంలోని శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు చెబుతారు.
భక్తుల కోసం ప్రత్యేక బస్సులు
మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు వచ్చిన భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. గతేడాది మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పంపా నుంచి బస్సులను నడిపింది. ఇటు ఏపీ, తెలంగాణ నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.


