
నెలలు నిండిన ఓ యువతి బస్సెక్కింది. సరిగ్గా ప్రయాణంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చప్పుడు కాకుండా ప్రసవించిన ఆమె.. ఆ బిడ్డను గుడ్డలో చుట్టి రోడ్డు మీదకు విసిరి పారేసింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది.
మహారాష్ట్ర పర్బానీలో దారుణం జరిగింది. బస్సుల్లోనే బిడ్డను ప్రసవించిన ఓ యువతి.. ఆపై దారుణానికి ఒడిగట్టింది. కళ్లు తెరవని ఆ పసికందును రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల ఆ యువతితో పాటు భర్తగా చెప్పుకున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పర్బానీ నుంచి పుణే వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే.. బస్సులోంచి ఓ చిన్నమూట బయటకు పడింది. కిటికీలోంచి అది చూసిన డ్రైవర్.. అనుమానం వచ్చి బస్సును ఆపి ప్యాసింజర్ల దగ్గరకు వచ్చి ఆరా తీశాడు. అయితే..
తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. వాళ్లు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. దీంతో.. ప్రయాణికులంతా ఆ జంటను నిలదీశారు.
తమ పేర్లు రితికా ధిరే, అల్తాఫ్ షేక్‌గా చెప్పుకున్న ఆ జంట.. ఏడాదిన్నరగా పుణేలో కాపురముంటున్నామని చెప్పారు. అయితే బిడ్డను పెంచి పోషించే స్తోమత తమకు లేదని.. అందుకే ఇలా చేశామని ఆ ఇద్దరు చెప్పారు. ఆపై ఎమర్జెన్సీ నెంబర్ 112 ద్వారా పోలీసులను ఈ సమాచారం అందించారు.
పార్తీ స్టేషన్ పోలీసులు వచ్చి విచారణ జరపగా.. ఆ జంట భార్యభర్తలే అని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ అయిన యువతిని ఆస్పత్రికి.. సదరు వ్యక్తిని జైలుకి తరలించారు. డిశ్చార్జి తర్వాత ఆ జంటను కలిపి విచారణ జరిపే యోచనలో పోలీసులు ఉన్నారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు.