జీరో కరోనా కేసులు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ

Maharashtra Launches Corona Free Village Contest Prize Money Up to Rs 50 Lakh - Sakshi

వినూత్న పోటీ ప్రారంభించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబై: కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మహారాష్ట్ర ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న తరహాలో విభిన్న పోటీని ప్రవేశపెట్టింది. 50 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీతో ‘కరోనా ఫ్రీ విలేజ్’ పోటీని ప్రారంభించింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ కరోనాపై అవగాహన కోసమే కాక వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం ఈ పోటీని ప్రారంభిస్తున్నామన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి హసన్ ముష్రిఫ్ మాట్లాడుతూ ‘‘‘కరోనా ఫ్రీ విలేజ్’ పోటీ వైరస్‌ కట్టడి కార్యక్రమంలో ఓ భాగం. కరోనా కట్టడిలో విజయవంతమైన మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలకు నగదు బహుమతి ఇవ్వబడుతుంది. మొదటి బహుమతి కింద 50 లక్షలు, రెండో బహుమతి కింద 25 లక్షలు, మూడో బహుమతి కింద 15 లక్షల రూపాయల చొప్పున ఇస్తాము’’ అని తెలిపారు. 

రాష్ట్రంలో 6రెవెన్యూ విభాగాలు ఉన్నందున మొత్తం 18 బహుమతులు ఉంటాయని, ఇందుకు గాను 5.4 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన వివరించారు. పోటీలో గెలిచిన గ్రామాలకు బహుమతి డబ్బుతో సమానమైన అదనపు మొత్తం ప్రోత్సాహంగా ఇస్తామని, ఈ డబ్బు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.   

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్రలోని అతి పిన్న వయసు సర్పంచ్ అయిన షోలాపూర్ జిల్లా ఘాట్నే గ్రామ సర్పంచ్ రుతురాజ్ దేశ్ ముఖ్ (21) తన గ్రామంలో కరోనా వైరస్ లేకుండా ఉంచడానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. మరో వైపు మహారాష్ట్రలో మంగళవారం 14, 123 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య 96,198కి చేరుకుంది.

చదవండి: వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top