రాజ్యసభ, విధాన్‌ పరిషత్‌ ఎన్నికలు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కీలక ఆదేశాలు

Maharashtra Forbids Depts From Transferring Officials Till June 30  - Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, అధికారులు, కిందిస్ధాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జూన్‌ 30వ తేదీ వరకు నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ధేశించారు. అందుకు సంబంధించిన సర్క్యులర్‌ సామాన్య పరిపాలన విభాగం జారీ చేసింది. త్వరలో రాజ్యసభ, విధాన్‌ పరిషత్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల కారణంగా ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురికావద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి బదిలీ ప్రక్రియ నిలిపివేసి ఉండవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి.

ఏటా వేసవి సెలవులు వచ్చాయంటే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్, మేలో ఈ బదిలీ ప్రక్రియ ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది. కొందరు ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం బదిలీకాగా, మరికొందరు అనేక సంవత్సరాల నుంచి ఒకేచోట తిష్టవేయడంవల్ల అటోమేటిక్‌గా బదిలీ అవుతుంది. మరికొందరు వివిధ కారణాలు చూపుతూ తమను బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకుంటారు. మంత్రులు, ఉన్నతాధికారులతో పైరవీలు చేయించుకుంటారు. ముఖ్యంగా అధిక శాతం ఉద్యోగులు పీడబ్ల్యూడీ, జలవనరులు, ఆర్థిక, గ్రామాభివృద్ధి, గృహనిర్మాణ, రవాణ, వ్యవసాయ తదితర కీలక శాఖల్లో తమను బదిలీ చేయాలని భారీ స్ధాయిలో లాబీయింగ్‌ చేస్తుంటారు.

వీటన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఏటా మే 31 వరకు బదిలీల ప్రకియ పూర్తి చేస్తారు. కానీ ఈ ఏడాది అకస్మాత్తుగా సామాన్య పరిపాలన విభాగం బదిలీ ప్రక్రియ జూన్‌ 30వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు సర్క్యులర్‌ జారీ చేయడం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మూడు భాగస్వామ్య పార్టీలతో కూడిన మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీల ప్రభుత్వం కావడంతో అధికారులు, ఉద్యోగుల బదిలీలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జూన్‌ 30వ వరకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. 
చదవండి: అత్యంత ఖరీదైన వెజిటేబుల్‌ ఇదే...ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే

అసంతృప్తి ఎదురుకావద్దనే... 
ఇదిలాఉండగా ఆరు రాజ్యసభ స్ధానాలకు, 10 విధాన్‌ పరిషత్‌ స్ధానాలకు జూన్‌ 20వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపే ప్రభుత్వ ఉన్నతాధికారుల బదిలీ అయితే ఎమ్మెల్యేల నుంచి అనేక ఫిర్యాదులు వస్తాయి. తమకు ఫలానా తహసీల్దార్‌ కావాలని, ఫలానా బీడీఓ కావాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం మే 31లోపు బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తే ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్యసభ, విధాన్‌ పరిషత్‌ స్ధానాలను ఎమ్మెల్యేలే గెలిపించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురికాకూడదన్న ఉద్దేశంతో బదిలీలు వాయిదా వేయాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై మూడు పార్టీల మంత్రులు సైతం సానుకూలత ప్రదర్శించారని విశ్వసనీయ సమాచారం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top