మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు.. ఎంపీ ఎన్నిక రద్దు.. అన్నాడీఎంకేకు షాక్‌

Madras High Court Cancels Election Of AIADMK MP OP Ravindranath - Sakshi

చెన్నై: తమిళనాడులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌కు షాక్‌ తగిలింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ మద్రాస్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది.

వివరాల ప్రకారం.. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగలింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి ఎంపీగా గెలుపొందిన రవీంద్రనాథ్‌ ఎన్నికను రద్దు చేస్తూ మద్రాస్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి ఈవీకేఎస్‌ ఎలంగోవన్‌పై 76,672 ఓట్ల ఆధిక్యతతో రవీంద్రనాథ్‌ గెలుపొందారు. కాగా, ఆయన ఎన్నికపై మిలానీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా రవీంద్రనాథ్‌ ఆస్తులకు సంబంధించి తప్పుడు పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే, గెలుపు కోసం అవినీతికి పాల్పడినట్టు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఇక, ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికను మద్రాస్‌ హైకోర్టు రద్దు చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే నుంచి రవీంద్రనాథ్‌ 2022లో పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి రవీంద్రనాథ్‌ మాత్రమే గెలుపొందడం గమనార్హం. డీఎంకే-కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లలో 38 గెలుచుకుంది. 

ఇది కూడా చదవండి: ఎన్సీపీ విద్యార్ధి నాయకుల వినూత్న పోస్టర్ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top