Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్‌ జేడీయూ! | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్‌ జేడీయూ!

Published Fri, May 10 2024 4:47 AM

Lok Sabha Election 2024: Shambhavi Chaudhary Vs Sunny Hazari: Both their fathers are ministers in Nitish Kumar cabinet from JDU

సమస్తిపూర్‌లో చిత్రమైన పోరు  

పోటీ కాంగ్రెస్, ఎల్జేపీ నడుమ  

బరిలోనేమో మంత్రుల పిల్లలు

సమస్తిపూర్‌. బిహార్‌ దివంగత సీఎం, భారతరత్న కర్పూరీ ఠాకూర్‌ జన్మస్థలం. ఈ నెల 13న నాలుగో విడతలో పోలింగ్‌ జరగనున్న ఎస్సీ రిజర్వుడ్‌ లోక్‌సభ స్థానం. కాంగ్రెస్‌ నుంచి సన్నీ హజారీ, లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌) తరఫున శాంభవి కునాల్‌ చౌదరి తలపడుతున్నారు. ఇందులో విశేషం ఏముందంటారా? వీరి తండ్రులిద్దరూ అధికార పక్షమైన జేడీ(యూ) నేతలు! పైగా రాష్ట్ర మంత్రులు!! జేడీ(యూ) చీఫ్, సీఎం నితీశ్‌కుమార్‌ శాంభవికి మద్దతుగా నిలుస్తుంటే మంత్రి అయిన సన్నీ తండ్రి మాత్రం కుమారుని కోసం ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు...! 

బిహార్‌లో ఇటీవలి దాకా కాంగ్రెస్, ఆర్జేడీ దన్నుతో సీఎంగా కొనసాగిన నీతిశ్‌ ఎన్నికల ముందు వాటికి గుడ్‌బై చెప్పడం, ఎన్‌డీఏ గూటికి చేరి కురీ్చని కాపాడుకోవడం తెలిసిందే. బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ, కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్ష ఇండియా కూటములు ఈ లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడుతున్నాయి. కానీ జేడీ(యూ) నేత, రాష్ట్ర మం్రత్రి మహేశ్వర్‌ హజారీ మాత్రం తన కుమారుని కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ ప్రచారం చేస్తుండటం విశేషం. 

ఆయన లోక్‌ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రాం విలాస్‌ పాశ్వాన్‌కు బంధువు కూడా! సమస్తిపూర్‌లో దాపు 17.5 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 20 శాతం ఎస్సీలే. కుశ్వాహ, యాదవుల వంటి ఓబీసీలూ ఎక్కువే. ముస్లిం ఓటర్లు 13 శాతమున్నారు. ఇక్కడ గ్రామీణ ఓటర్లే 95 శాతం. 2014, 2019ల్లో ఎల్జేపీ తరఫున రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తమ్ముడు రామచంద్ర పాశ్వాన్‌ గెలుపొందారు. ఆయన హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కుమారుడు ప్రిన్స్‌ రాజ్‌ విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం పశుపతి పార్టీ ఆర్‌ఎల్జేపీలో ఉన్నారు.

శాంభవి.. మరో మంత్రి గారమ్మాయి!
ఇక ఎల్జేపీ (రాం విలాస్‌) అభ్యర్థి శాంభవి తండ్రి అశోక్‌ చౌదరి కూడా మంత్రిగా జేడీ(యూ) సర్కారులో కీలక శాఖలు చూస్తున్నారు. 25 ఏళ్ల శాంభవి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అత్యంత పిన్న వయసు్కరాలు. అయితే ఆమెకు టికెటివ్వడంతో పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌పై నేతల్లో అసంతృప్తి భగ్గుమంది. నిరసనగా పలువురు రాజీనామా కూడా చేశారు! పైగా ఆమె నాన్‌లోకల్‌ అంటూ కాంగ్రెస్‌ ప్రచారం హోరెత్తిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ)కు దెబ్బ తీసి 48 స్థానాలకు పరిమితం చేయడంలో చిరాగ్‌ది కీలక పాత్ర. ఎందుకంటే పాశ్వాన్‌ మరణానంతరం ఆయన సోదరుడు పశుపతి పరాస్, కుమారుడు చిరాగ్‌ మధ్య నితీశ్‌ చిచ్చురేపారు. ఎల్జేపీ పశుపతి పరమయ్యేలా చేశారు. ఈ ఎపిసోడ్లో మహేశ్వర్‌ హజారేది కూడా కీలక పాత్రే. కాంగ్రెస్‌ సన్నీకి టికెట్‌ ప్రకటించగానే, తమ కుటుంబంలో చిచ్చు పెట్టింది హజారీయేనంటూ చిరాగ్‌ మండిపడ్డారు కూడా!

నితీశ్‌ దన్ను!  
సమస్తిపూర్‌ తన మెట్టినిల్లంటూ నాన్‌లోకల్‌ ప్రచారాన్ని శాంభవి తిప్పికొడుతున్నారు. మోదీ ఫ్యాక్టర్‌ కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నితీశ్‌ కూడా ఆమెకు మద్దతిస్తున్నారు! పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన పార్టీ ఎంపీ, కర్పూరీ ఠాకూర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌ను శాంభవికి దన్నుగా రంగంలోకి దించారాయన. సమస్తిపూర్‌లో మెజారిటీ ప్రజలు పాశ్వాన్‌ నిజమైన రాజకీయ వారసునిగా చిరాగ్‌నే చూస్తుండటం శాంభవికి కలిసొచ్చే అంశం. మొత్తానికి సమస్తిపూర్‌ లోక్‌సభ ఎన్నిక జేడీ(యూ) మంత్రుల మధ్య పోరాటానికి వేదికగా మారిందని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు!  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement