Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు | Sakshi
Sakshi News home page

Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు

Published Thu, May 23 2024 4:43 AM

Lok Sabha Election 2024: Kejriwal says he does not want to become PM if INDIA wins

ఆప్‌ 22 చోట్ల పోటీ చేస్తున్న చిన్న పార్టీ 

‘మలివాల్‌’పై పారదర్శక దర్యాప్తు జరగాలి 

నా భార్య రాజకీయాల్లోకి రాబోదు 

పీటీఐ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌ 

న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్‌ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్‌ కుమార్‌ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్‌ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

నియంతృత్వాన్ని నిలువరిస్తాం 
‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్‌ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్‌ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్‌) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. 

సానుకూల పవనాలు ఊహించిందే 
ఆప్‌ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్‌–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్‌ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్‌ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. 

మలివాల్‌ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి 
మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. 

న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్‌
ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్‌ అని తేలుతాయి. అందుకే జూన్‌ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు        పోయినట్లు?

సునీతది ధర్మాగ్రహం 
2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement