బీజేపీ ఎల్‌డీఎఫ్‌ రహస్య దోస్తీ  | Kerala Left Democratic Front and the BJP of having a secret friendship | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎల్‌డీఎఫ్‌ రహస్య దోస్తీ 

Mar 31 2026 3:42 AM | Updated on Mar 31 2026 3:44 PM

Kerala Left Democratic Front and the BJP of having a secret friendship

అందుకే శబరిమల అంశంపై మోదీ మౌనం దాల్చారు 

రాహుల్‌గాంధీ ఆరోపణ

పథనంతిట్ట/కొట్టాయం: కేరళలో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) కూటమితో బీజేపీ రహస్య దోస్తీ కొనసాగిస్తోందని, రెండూ కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్‌ ఆదూర్‌ పట్టణంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘‘మనం ఎన్నికల్లో ఒక్క కూటమిని మాత్రమే ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎల్‌డీఎఫ్‌ కూటమితో బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. అందుకే శబరిమల అంశంపై మోదీ ఏమీ మాట్లాడటం లేదు.

 దేశంలో ఎక్కడికెళ్లినా మతం, ఆలయాల ప్రస్తావన తెచ్చే మోదీ.. కేరళలో మాత్రం ఎందుకు శబరిమల అంశంపై మౌనం దాల్చారు?. ఎన్నికల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనే మోదీ మతపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. లేదంటే వాటి ఊసెత్తరు’’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ‘‘దేశవ్యాప్తంగా తమకు గిట్టని పారీ్టలు, నేతలపై ఈడీని ఉసిగొల్పే మోదీ సర్కార్‌ కేరళలో మాత్రం ఎల్‌డీఎఫ్‌ కూటమి పారీ్టలు, నేతలను ఎందుకు వదిలేసింది? అదే నాపై అయితే డజన్లకొద్దీ కేసులు మోపి విచారణ పేరిట దర్యాప్తు సంస్థల కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. నాపై 36 కేసులు పెట్టారు. 

ఏకధాటిగా 55 గంటలపాటు విచారించారు. ఇలాంటి కఠిన చర్యలు కేరళ ముఖ్యమంత్రి లేదా ఎల్‌డీఎఫ్‌ నేతలపై ఎందుకు తీసుకోవట్లేదు?’’అని మోదీ ప్రభుత్వాన్ని రాహుల్‌ నిలదీశారు. ‘‘ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త చెప్పినట్లు మార్కెట్లో ఒక అదృశ్యశక్తి ఉందంటే అది మాత్రమే ఆర్థికవ్యవస్థను నడిపిస్తుందని అర్థం. అలాగే కేరళ ఎన్నికల్లో అదృశ్యశక్తి దాగి ఉంది. అదే బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉంది. అందుకే కేరళలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా బీజేపీ కుటిలయత్నాలు చేస్తోంది. పాలక్కడ్‌లో మోదీ ఆదివారం మాట్లాడారుగానీ కీలక అంశాలను వదిలేశారు. అయ్యప్ప ఆలయంలో వామపక్ష నేతల చోరీని మోదీ మాటవరసకైనా ప్రస్తావించలేదు’’అని రాహుల్‌ అన్నారు.  

ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే నిధులు అందాలేమో.. 
యూడీఎఫ్‌ కూటమి అభ్యర్థి చాందీ ఊమెన్‌కు మద్దతుగా రాహుల్‌ సోమవారం పథుప్పల్లి నియోజకవర్గంలో ప్రచారంచేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సైకిల్‌ తొక్కి అక్కడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల(నియంత్రణ)చట్టం సవరణ బిల్లుపై రాహుల్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు.‘‘హఠాత్తుగా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం తెచ్చారు. ఇందులో గమ్మత్తైన విషయమేంటంటే విదేశాల నుంచి ఇకపై కేవలం ఒక సంస్థ మాత్రమే విరాళాలు పొందే ఆస్కారముంది. అదే ఆర్‌ఎస్‌ఎస్‌. గౌతమ్‌ అదానీ ద్వారా విదేశీపెట్టుబడిదారులను మోదీ శాసిస్తున్నారు. మరోవైపు ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలతో ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే లబ్ధిపొందనుంది’’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement