కాంగ్రెస్‌ టికెట్‌కు దరఖాస్తులు షురూ.. ఫీజు రూ.2లక్షలే.. వారికి 50శాతం డిస్కౌంట్‌!

Congress Ticket Aspirants Deposit DD Of Rs 2 Lakh - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్‌. ఎన్నికల పట్ల అభ్యర్థులు సీరియస్‌గా ఉండేందుకోసమంటూ దరఖాస్తు ప్రక్రియను బుధవారం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు సాగనుందన్నారు. 

‘కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. దరఖాస్తు విండో నవంబర్‌ 5 నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంటుంది. మా ఆఫీసులో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్‌ ఫీజు రూ.5,000. జనరల్‌ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.2 లక్షల డిమాండ్‌ డ్రాఫ్ట్‌(డీడీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం డిస్కౌంట్‌తో రూ.1 లక్ష కట్టాలి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో నేను సైతం ఉంటాను. నేను పోటీ చేయాలనుకుంటే, తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందే.’అని తెలిపారు కేపీసీసీ ప్రెసిడెంట్‌ డీకే శివకుమార్‌. ఈ ఫండ్స్‌ను పార్టీ నూతన భవనం నిర్మాణం సహా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. 

మరోవైపు.. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఈసారి దరఖాస్తులను ముందస్తుగానే ఆహ్వానిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల పట్ల అశ్రద్ధగా ఉన్నవారిని ఫిల్టర్‌ చేసేందుకే ఫీజును పెంచినట్లు చెప్పాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మార్గదర్శకత్వం, కాంగ్రెస్‌ భావజాలాన్ని నమ్మే వారు ఎవరైనా పార్టీలో చేరొచ్చని తెలిపారు డీకే శివకుమార్‌. ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు కొనసాగుతోందని చెప్పారు. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన క్రమంలో ఆయనకు నవంబర్‌ 6న సర్వోదయ సమవేశం ద్వారా ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్‌ చేయండి’.. జార్ఖండ్‌ సీఎం సవాల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top