సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం

Karnataka cabinet allocation: CM Siddaramaiah keeps finance, Shivakumar gets Bengaluru development - Sakshi

శివకుమార్‌కు ఇరిగేషన్, బెంగళూరు డెవలప్‌మెంట్‌

హోం శాఖ మళ్లీ జి.పరమేశ్వరకే..

ప్రియాంక్‌ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌

మంత్రులకు శాఖలను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్‌

బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్‌ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు.

వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్‌కు, కేజే జార్జికి విద్యుత్‌ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్‌ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి.

శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్‌ శాఖలను ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్‌ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్‌రాయ్‌ శాఖలను ఇచ్చారు.

హెచ్‌సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్‌ జర్కిహోళికి పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్‌కు టెక్స్‌టైల్స్, అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ బాధ్యతలు కేటాయించారు. దినేశ్‌ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్‌ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్‌ హెబ్బాల్కర్‌కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్‌ సిటిజన్‌ సాధికారిత శాఖ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top