ప్రేమ.. ఎంత పని చేసింది? | Karnataka Bengaluru Prerana Kiran Case Full Details | Sakshi
Sakshi News home page

ప్రేమ.. ఎంత పని చేసింది?

Apr 22 2026 10:00 AM | Updated on Apr 22 2026 10:08 AM

Karnataka Bengaluru Prerana Kiran Case Full Details

ప్రేమలో అనుమానం ఎంత ఘోర పరిణామానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటనే ఇది. ఓ యువతి తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడింది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో అతన్ని సజీవదహనం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ కథనం అసలు వివరాల్లోకి వెళ్తే..  

ప్రేరణ, కిరణ్‌ ఇద్దరూ ఓ టెలికాం స్టోర్‌లో జాబ్‌ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అయితే కొంత కాలంగా అతను ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించింది. 

మంగళవారం దక్షిణ బెంగళూరులో ఉన్న తన ఇంటికి రావాలంటూ పిలిచింది. వెరైటీ ప్రపోజ్‌ ప్లాన్‌ గురించి చెప్పింది. దానికి తొలుత అతను ఒప్పుకోలేదు. అయితే ఫారిన్‌లో ఇదంతా కామన్‌ అని బలవంతం చేసేసరికి సరే అన్నాడు. కిరణ్‌ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టేసింది. అతను నిజంగానే ఆమె ఏదో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోందని ఆశపడ్డాడు. 

కానీ.. ఇంట్లో అప్పటికే దాచిన కిరోసిన్‌ను తెచ్చి అతని మీద పోసి నిప్పంటించి దూరం నుంచి ఫోన్‌లో వీడియో తీయసాగింది. కిరణ్‌ ఆరుపులు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

పోలీసుల విచారణలో.. తనను పెళ్లి చేసుకోడనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్‌ చేశారు.ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోను ఆమె ఫోన్‌ నుంచి స్వాధీనపర్చుకున్నారు. కిరణ్‌-ప్రేరణల మధ్య స్నేహం గురించి తమకు తెలుసని.. వాళ్లు ఒప్పుకుంటే వివాహం కూడా జరిపించాలని తాము భావించామని ఇరువైపులా పెద్దలు చెబుతున్నారు. ప్రేమ అనేది నమ్మకం.. కానీ అనుమానం ప్రాణాలు తీసింది అని సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement