రచన ఏదైనా ప్రశ్నించడమే లక్ష్యం! | Sakshi
Sakshi News home page

రచన ఏదైనా ప్రశ్నించడమే లక్ష్యం!

Published Sat, Jul 29 2023 3:37 AM

Javed Akthar Writings on Social and Society - Sakshi

జావేద్‌ అఖ్తర్‌ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్‌ ప్లే రచయిత.  సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రక టిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్‌ అఖ్తర్‌.  భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్‌ అఖ్తర్‌ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్‌ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. 

గ్వాలియర్‌లో పుట్టిన జావేద్‌ లక్నో అలీగఢ్, భోపాల్‌లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిధి బాగా విస్తారమయింది. జావేద్‌ తన మిత్రుడు సలీం ఖాన్‌తో కలిసి రాసిన స్క్రీన్‌ ప్లేలు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయ వంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది. ‘హాథీ మేరె సాథీ’. అది సూపర్‌ హిట్‌ కావడంతో ఆ జంట హిందీ సినీ రంగంలో హాట్‌ కేక్‌గా మారింది. ‘సీతా ఔర్‌ గీతా’ చిత్రానికి పనిచేసే సమయంలో జావేద్‌కు ‘హనీ ఇరానీ’తో అయిన పరిచయం పెళ్లిదాకా వెళ్ళింది. వారిద్దరికీ జోయా, ఫర్హాన్‌లు జన్మించారు.

 1979లో తన మొదటి కవిత రాశారు జావేద్‌. ఇంచుమించు అదే కాలంలో ‘షబానా ఆజ్మీ’తో పరిచయం సాన్నిహిత్యంగా మారింది. 1995లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘తర్కశ్‌’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమా  నుల నుంచీ, విమర్శకుల నుంచీ ప్రశంసను అందు కుంది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్‌గా కూడా ప్రాచుర్యం పొందింది.  1983లో హనీ ఇరానీ, జావేద్‌ విడిపోయారు. కానీ స్నేహంగానే ఉన్నారు. 

సలీం–జావేద్‌ జంటగా ‘అందాజ్‌’, ‘యాదోంకీ బారాత్‌’, ‘జంజీర్‌’, ‘దీవార్‌’, ‘షోలే’, ‘డాన్‌’, ‘త్రిశూల్‌’ లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సిని మాలకు స్క్రిప్టు రాశారు. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్టుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆ జంట విడి పోయింది. 1981లో సలీం, జావేద్‌ల జంట విడి పోయాక జావేద్‌ అఖ్తర్‌ చాలా సినిమాలకు స్క్రిప్ట్‌ రచన చేశారు. వాటిల్లో ‘సాగర్‌’, ‘మిస్టర్‌ ఇండియా’, ‘బెతాబ్‌’, ‘లక్ష్య’ లాంటి విజయవంత మయిన సినిమాలు ఉన్నాయి. 

తర్వాత జావేద్‌ అఖ్తర్‌ ఫిలిం గీతాలవైపు కదిలారు. అలాగే గొప్ప కవితలూ రాశారు. ఆయన రాసిన కవితలు, గజల్స్‌ సూటిగా మనసుకు హత్తు కుంటాయి. ‘లావా’ కవితా సంపుటి 2012లో వెలువడింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్‌ ఆదర్‌ వర్డ్స్‌.’ అందులో ఆయన కాలాన్ని గురించి..  కాలమంటే ఏమిటి, /అలుపూ విరామమూ లేకుండా /సాగిపోతున్నది /అదట్లా ప్రయాణించ కుండా ఉండి వుంటే అదెక్కడుండేది / ఎక్కడో ఒక చోట ఉండేది కదా... అంటూ గొప్ప తాత్వికతతో రాశారు.

ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మ నుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల నుండి పెల్లుబుకుతుంది. వర్తమాన అవ్యవస్థ గురించి తనకోపమూ, తన తాత్వికత, వేదన, దుఃఖం, ప్రశ్న–జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించారు. ఇందులో వర్తమాన మత ఛాందసవాదం గురించి ఖండిస్తూ రాశారు, మాట్లా డారు. ఇక పార్లమెంట్‌ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి, కాపీ రైట్‌ చట్టం గురించీ పోరాడి సాధించారు. ప్రశ్నించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించారు. 

వ్యాసకర్త సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత
(జావేద్‌ అఖ్తర్‌కు నేడు సినారె పురస్కార ప్రదానం) 

Advertisement
 
Advertisement