బాలిక పొట్టలో 2 మీటర్ల వెంట్రుకల పోగు | Jaipur doctors removed the world longest hairball from teen girl stomach | Sakshi
Sakshi News home page

బాలిక పొట్టలో 2 మీటర్ల వెంట్రుకల పోగు

Jun 1 2025 6:24 AM | Updated on Jun 1 2025 11:52 AM

Jaipur doctors removed the world longest hairball from teen girl stomach

ప్రపంచంలోనే రికార్డు.. తొలగించిన జైపూర్‌ వైద్యులు

జైపూర్‌: రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన వైద్యులు ఓ బాలిక పొట్టలోని 210 సెంటీమీటర్ల పొడవైన వెంట్రుకల పోగు(ట్రైకోబెజొయర్‌)ను శస్త్రచికిత్సతో విజయవంతంగా తొలగించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద వెంట్రుకల పోగుగా రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు ఉన్న వెంట్రుకల పోగు రికార్డు 180 సెంటీమీటర్లు కావడం విశేషం. యూపీలోని ఆగ్రాకు చెందిన పదో తరగతి చదువుకునే 14 ఏళ్ల బాలిక నెల రోజులుగా వాంతులు, కడుపునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. పరీక్షలు చేపట్టిన వైద్యులు..పొట్ట కుడివైపున, బొడ్డు వరకు గట్టి పదార్థం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 

కాంట్రాక్ట్‌ ఎన్‌హాన్స్‌డ్‌ సీటీ స్కాన్‌ తీయగా పొట్టంతా ఉబ్బిపోయి అసాధారణ పదార్థం నిండి ఉన్నట్లు తేలింది. వైద్యుల బృందం వెంటనే ఆపరేషన్‌ ప్రక్రియను చేపట్టింది. గాస్రోటోమీ శస్త్రచికిత్సతో బయటపడిన భారీ వెంట్రుకల ఉండ పొట్టతోపాటు చిన్న పేగు భాగం వరకు విస్తరించి ఉండటాన్ని చూసి వైద్యులు విస్తుపోయారు. ఇదంతా ఏకభాగంగా ఉండటంతో బయటకు తీయడం సవాల్‌గా మారింది. ముక్కలుగా చేయాలంటే పేగు భాగానికి సైతం పలు కోతలు పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ వైద్యులు ఎంతో సంక్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. 

ఎందుకిలా ఉంది..?: బాధిత బాలికకు ఆరో తరగతి నుంచే మట్టి, కర్ర ముక్కలు, దారం, చాక్‌పీస్‌ వంటివి తినే అలవాటుంది. తోటి పిల్లలు తింటుంటే చూసి తనూ అలవాటు చేసుకుంది. ఈ అలవాటును వైద్యులు ‘పికా’అనే మానసిక ఆరోగ్య సమస్యగా పేర్కొంటున్నారు. ఆహారేతర పదార్థాలను బలవంతంగా మింగడమే దీని ముఖ్య లక్షణం. బాధిత బాలిక పొట్ట నుంచి తొలగించిన ట్రైకోబెజొయర్‌ ప్రపంచంలోనే ఇప్పటి వరకు తీసిన అత్యంత పొడవైందిగా రికార్డు నెలకొల్పిందని వైద్యులు తెలిపారు. పొట్ట భాగం నుంచి చిన్న ప్రేవు వరకు విస్తరించిన ఈ పోగును సురక్షితంగా తొలగించడం వైద్యచరిత్రలో ఒక మైలురాయని శస్త్ర చికిత్స బృందానికి సారథ్యం వహించిన డాక్టర్‌ జీవన్‌ కంకారియా చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement