
భువనేశ్వర్: శ్రీ మందిరం ప్రాకారంలో భాగంగా జగతినాథుని వివిధ అలంకారాల శోభిత ప్రతిమల్ని సమగ్ర ఎయిర్ కండిషన్ జగన్నాథ్ వల్లభ్ సముదాయంలో అత్యంత అట్టహాసంగా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకుని భక్తులు, యాత్రికుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ఏర్పాటు చేసింది.
ఏడాది పొడవునా పలు పండగలు, ఉత్సవాలు, యాత్రలు సందర్భంగా స్వామి వివిధ రూపాల అలంకరణతో ఈ నమూనా మూర్తుల్ని ఎయిర్ కండిషన్ సముదాయంలో సందర్శకుల కోసం ప్రదర్శించారు. ఒకే చోట ఆరాధ్య దైవం వివిధ అపురూప అలంకరణ శోభతో తిలకించే భాగ్యం పట్ల అశేష భక్త, యాత్రికుల జనం సంతోషం వ్యక్తం చేసింది. పాలకులు మారడంతో తీరు మారింది. పవిత్రమైన జగతి నాథునితో అన్నా చెల్లెలు బలభద్ర స్వామి, దేవీ సుభద్ర ప్రతిమలు మరుగున పడ్డాయి. జగన్నాథ్ వల్లభ్ సముదాయం సెల్లార్ వాహన పార్కింగులో మూటలు గట్టి ఈ పవిత్ర ప్రతిమల్ని మరుగున పడేశారు.
ఈ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. స్వామి 25 రకాల అలంకరణతో యాత్రికులకు అలరించిన నమూనా ప్రతిమలు నేడు ఇలా మరుగున పడడం అత్యంత విచారకరం. వీటిలో అత్యంత అరుదైన రఘునాథ అలంకరణ నమూనా కూడ మూటలో ముడి పడి పోయింది. ప్రత్యక్షంగా స్వామి అలంకరణని తిలకించే భాగ్యం లేని అపురూప రూపాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం, శ్రీ మందిరం యాజమాన్య యంత్రాంగం నిర్లక్ష్యపు చర్యలతో ఇలా అపవిత్రత మధ్య మగ్గిపోతున్నాయి.