ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్‌ ప్రయోగంలో సందిగ్ధత | Isro Launch India Newest Rocket SSLV D1 | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్‌ ప్రయోగంలో సందిగ్ధత

Aug 7 2022 9:21 AM | Updated on Aug 7 2022 11:56 AM

Isro Launch India Newest Rocket SSLV D1 - Sakshi

చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది.

సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. రాకెట్‌ గమనాన్ని విశ్లేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.

మూడో దశ తర్వాత ఈవోఎస్‌-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్‌ వదిలింది. సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్‌ సెంటర్‌కు సిగ్నల్‌ అందడం లేదని శాస్త్తవేత్తలు తెలిపారు. మూడు దశల ప్ర​‍యోగాలు పూర్తయ్యాయని.. నాలుగో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. తుది దశ సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని(షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది.
చదవండి: ఆరోగ్య బీమాలో రెండో స్థానంలో ఏపీ

చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2ఏ(ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్‌’ను ప్రయోగించారు.

ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్‌ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది.

బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్‌ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్‌ కౌంటర్లు, సోలార్‌ ప్యానల్‌ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–ఇంజనీరింగ్‌ మ్యాథమేటిక్స్‌’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్‌ షరూక్‌ అనే మహిళ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు.  

Advertisement
 
Advertisement
Advertisement