ఆరోగ్య బీమాలో రెండో స్థానంలో ఏపీ

All Over India AP Ranks 2nd Place in Health Insurance - Sakshi

రాష్ట్రంలో 80.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా

రాజస్థాన్‌లో అత్యధికంగా 87.94 శాతం కుటుంబాలకు బీమా

2019–21 సుస్థిర అభివృద్ధి్ద లక్ష్యాల పురోగతి నివేదిక వెల్లడి

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్‌ ప్రత్యేక చర్యలు

ఆదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంచి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింపు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఆరోగ్య బీమా కలిగిన కుటుంబాల్లో రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలబెట్టాయి. 2019–21 సంవత్సరాలకు రాష్ట్రంలోని 80.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉందని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి–2022 నివేదిక వెల్లడించింది. 87.94  శాతం కుటుంబాలతో రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది.

2015–16లో రాష్ట్రంలో 74.6 శాతం కుటుంబాలకే ఆరోగ్య బీమా ఉంటే 2019–21 సంవత్సరాలకు ఇది ఏకంగా 80.2 శాతానికి పెరిగినట్లు నివేదిక తెలిపింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆరోగ్య శ్రీ పథకానికి జవసత్వాలను కల్పించారు. అంతే కాకుండా ఆరోగ్య శ్రీ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. అంటే పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు కూడా వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింప చేయడం ద్వారా ఆరోగ్య బీమాను కల్పించారు.

ఇలా రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీని వర్తింప చేయడంతో రాష్ట్రంలో 80.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తిస్తోంది. అంతే కాకుండా చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీని వర్తింపచేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 69.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉన్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో అత్యల్పంగా మణిపూర్‌లో 16.4 శాతం, బిహార్‌ 17.4 శాతం, నాగాలాండ్‌లో 22 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top