
దేశంలో మొట్టమొదటి అనలాగ్ టెస్టు
అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. వ్యోమగాములను 2027 నాటికి అంతరిక్షంలోకి, 2040 నాటికి చంద్రుడిపైకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దాంతోపాటు మరిన్ని కీలక అంతరిక్ష ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరీక్షల కోసం జమ్మూకశ్మీర్‌లోని లద్ధాఖ్‌ను ఇస్రో ఎంపిక చేసింది.
దేశంలో మొట్టమొదటి అనలాగ్ మిషన్‌ను ఇక్కడే చేపట్టబోతోంది. అచ్చంగా అంతరిక్షంలో, ఇతర గ్రహాలపై ఉండే భౌతిక, వాతావరణ పరిస్థితులను ఇక్కడ సృష్టిస్తారు. అందులో వ్యోమగాములు ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా వారిలో కలిగే మార్పులను అధ్యయనం చేస్తారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం పరీక్షించబోతున్నారు. ఈ మిషన్‌కు హిమాలయన్ ఔట్‌పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్‌ప్లోరేషన్(హోప్) అని నామకరణం చేశారు.
→ లద్ధాఖ్‌లో ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 14,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఆక్సిజన్ లభ్యత 40 శాతమే. చలి కూడా అధికం. అంగారక గ్రహంతోపాటు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా ఉన్న పరిస్థితులను లద్ధాఖ్‌లో గుర్తించారు. అందుకే హోప్ మిషన్‌కు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
→ ఇద్దరు నివసించేలా ఒక ఇంటిని నిర్మిస్తారు. ఇది స్పేస్‌క్రాఫ్ట్ లాగే ఉంటుంది. ఆహారం వండుకోవడానికి వసతులుంటాయి. ఇతర వనరులు పరిమితంగానే కల్పిస్తారు. వ్యోమగాములు 10 రోజులపాటు నివసించాలి. ఇందుకోసం ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేశారు. ఒకరు ప్లానెటరీ సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, మరొకరు పీహెచ్ పరిశోధకుడు. 135 మంది దరఖాస్తు చేసుకోగా ఇద్దరికి అవకాశం దక్కింది.
→ సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు రోజుల తరబడి జరుగుతుంటాయి. క్లిష్టమైన పరిస్థితులకు తగ్గట్టుగా వ్యోమగాములు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందస్తుగానే పరీక్షలు
నిర్వహిస్తుంటారు.
→ అనలాగ్ మిషన్ అనేది అంతర్జాతీయంగా అమల్లో ఉన్న విధానం. వ్యోమగాముల ఆరోగ్యంపై పర్యవేక్షణ, ఎమర్జెన్సీ డ్రిల్స్‌తోపాటు ప్రతికూల పరిస్థితుల్లో కమ్యూనికేషన్లను పరీక్షించడానికి వాడుతున్నారు.
→ హోప్ ప్రాజెక్టులో ఐఐటీ–బాంబే, యూనివర్సిటీ ఆఫ్ లద్ధాఖ్‌తోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.
→ అనలాగ్ మిషన్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అడుగు ముందుకు వేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు.