ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు

Islamic nations that have issued summons to Indian envoy - Sakshi

భారత ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపులు

గల్ఫ్‌తో మన వాణిజ్యంపై ప్రభావం!

నష్ట నివారణకు రంగంలోకి కేంద్రం

న్యూఢిల్లీ/దుబాయ్‌: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ (ఓఐసీ) ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే గాక భారత్‌లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది! ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్‌ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్‌ చేసింది.

యూఏఈతో పాటు మక్కా గ్రాండ్‌ మాస్క్, మదీనా ప్రాఫెట్స్‌ మాస్క్‌ వ్యవహారాల జనరల్‌ ప్రెసిడెన్సీ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. సౌదీ విదేశాంగ శాఖ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఖతార్, కువైట్‌ ఒక అడుగు ముందుకేసి భారత్‌ క్షమాపణకు కూడా డిమాండ్‌ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్‌ అయిన గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలోనూ విద్వేష ప్రచారం
భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్‌ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. తమ సూపర్‌ మార్కెట్లలో టీ పొడి తదితర భారత ఉత్పత్తుల విక్రయాలను ఆపేయాలని యోచిస్తున్నట్టు కువైట్‌లోని అల్‌–అర్దియా కో ఆపరేటివ్‌ సొసైటీ వంటివి ఇప్పటికే ప్రకటించాయి. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది! అరబ్‌ ప్రపంచమంతా వాటిని నిషేధించాలంటూ ట్విట్టర్‌ తదితర సోషల్‌ మాధ్యమాల్లో ట్రెండింగ్‌ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలకు దిగింది. అటు ఓఐసీ వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండిస్తూనే, అవి కొందరు వ్యక్తుల అనాలోచిత వ్యాఖ్యలే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కానే కావని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీతో పాటు పలు ముస్లిం దేశాల్లోని భారత రాయబారులు స్థానికంగా కూడా ప్రకటనలు చేశారు.

బలమైన ఆర్థిక బంధం
అరబ్‌ ప్రపంచం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను శాంతింపజేసేందుకు భారత్‌ హుటాహుటిన రంగంలోకి దిగడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలోని ఈ ముస్లిం దేశాలతో మనకున్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు. సౌదీ, కువైట్, ఖతర్, ఒమన్‌ తదితర దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువగా ఉంటారు. యూఏఈ జనాభాలోనైతే 30 శాతం దాకా భారతీయులే. మొత్తమ్మీద ఈ ముస్లిం దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సంఖ్య ఏకంగా 87 లక్షలని అంచనా. వీరిలో కార్మికులే అత్యధికంగా ఉంటారు. తాజా వివాదం నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి.

గల్ఫ్‌ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తాలు (రెమిటెన్సులు) దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. 2021లో భారత్‌కు  87 బిలియన్‌ డాలర్ల రెమిటెన్సులు అందాయి. అంటే రూ.6.76 లక్షల కోట్ల పై చిలుకే! దేశ జీడీపీలో ఇది ఏకంగా 3.1 శాతం! ఇంతటి కీలకమైన ఈ రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్‌ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. దాంతో రెమిటెన్సుల్లో భారత్‌ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. కీలక గల్ఫ్‌ దేశాలతో కూడిన గల్ఫ్‌ కో ఆపరేటివ్‌ కౌన్సిల్‌(జీసీసీ)తో 2020–21లో భారత్‌ 87 మిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్యం జరిపింది. మన వర్తక భాగస్వాముల్లో యూఈఏ మూడో, సౌదీ నాలుగో స్థానంలో ఉన్నాయి. యూఏఈతో ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ కుదిరింది.
చదవండి: గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు

గల్ఫ్‌ దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఆర్టికల్‌ 370 రద్దును స్వాగతించిన తొలి దేశాల్లో యూఏఈ  ఉంది. ఇరాక్, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్‌ దేశాల నుంచి మనం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్నందున గల్ఫ్‌ దేశాలపై ఆధారపడటం మరింతగా పెరిగేలా కన్పిస్తోంది. మనతో వర్తకం ద్వారా సమకూరే ఆదాయం గల్ఫ్‌ దేశాలకూ కీలకమే. పైగా వాటి కార్మిక శక్తిలో భారతీయులు కీలకంగా ఉన్నారు. వీటికి తోడు చాలా గల్ఫ్‌ దేశాల ఆహార అవసరాలను భారతే తీరుస్తోంది. ఈ జాబితాలో బియ్యం, మాంసం, సుగంధద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు, చక్కెర వంటివెన్నో ఉన్నాయి. కువైట్‌ ఏకంగా 90 శాతం ఆహార పదార్థాలను భారత్‌ నుంచే దిగుమతి చేసుకుంటోంది!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top