
50 ఏళ్ల ప్రస్థానానికి తెర
పోస్టల్ శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: కోట్లాది మందికి చిరపరిచితమైన పోస్టల్‌శాఖ వారి ‘రిజిస్టర్డ్ పోస్ట్’ ఇక కనుమరుగు కానుంది. దేశవ్యాప్తంగా గత 50 సంవత్సరా లుగా కీలకమైన సర్టిఫికేట్లు, ఉద్యోగ నియామక పత్రాలు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ప్రజలకు చేరవేసిన పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ‘రిజిస్టర్డ్ పోస్ట్’ సేవలను కొనసాగించబోమని ‘ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్’ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇన్నాళ్లూ అందించిన సేవలనే స్పీడ్‌పోస్ట్ లేదంటే ఇతర సేవల్లో భాగంగా అందించనున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఆ పేరు మాత్రమే ఇకపై వినియోగించబోరని పోస్టల్‌శాఖ వర్గాలు తెలిపాయి. తక్కువ ఖర్చులో, అత్యంత విశ్వసనీ యమైన, అత్యంత అనువైన తపాలా సేవగా గత యాభై ఏళ్లుగా రిజిస్టర్డ్ పోస్ట్ జనం మదిలో నిలిచిపోయింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగ అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చిందంటే అది దాదాపు రిజిస్టర్డ్ పోస్ట్‌లో రావాల్సిందే.
ఉత్తరప్రత్యుత్తరాల కాలంలో రిజిస్టర్డ్ పోస్ట్‌కు ఎనలేని విలువ ఉండేది. 2011–12 కాలంలో దేశవ్యాప్తంగా 24.44 కోట్ల రిజిస్టర్డ్ పోస్ట్‌లను తపాలా శాఖ పంపించగా 2019–20 కాలానికి వచ్చేసరికి కేవలం 18.46 కోట్ల రిజిస్టర్డ్ పోస్ట్‌లే పంపించగల్గింది. అంటే ఏకంగా 25 శాతం రిజిస్టర్డ్ పోస్ట్‌లు తగ్గిపోయాయి. వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ కీలకమైన పీడీఎఫ్, ఇతర ఫైళ్లు, పత్రాలను పౌరులు నేరుగా సెకన్ల వ్యవధిలో పంపే సంస్కృతి పెరగడంతో రిజిస్టర్డ్ పోస్ట్‌కు ఆదరణ తగ్గిపోయిందని తెలుస్తోంది.