
అమెరికాకు అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులను ఇండియా పోస్ట్ అక్టోబర్ 15 నుంచి (నేడు) పునప్రారంభిస్తున్నట్లు పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) మార్గదర్శకాల ప్రకారం భారత్ నుంచి వెళ్లే షిప్‌మెంట్స్ కన్సైన్‌మెంట్ విలువలో 50 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుందని పేర్కొంది.
పోస్టల్ ఐటమ్‌లపై ప్రోడక్టును బట్టి సుంకాలు విధించడంలాంటివి ఉండదని వివరించింది. దీనితో చిన్న వ్యాపారులు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లు మొదలైన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని పోస్టల్ శాఖ తెలిపింది. జులై 30, 2025న యూఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేసింది. దాని ప్రకారం.. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు సుంకం రహిత మినహాయింపులను ఉపసంహరించుకుంది. 100 డాలర్ల లోపు బహుమతులు మినహా దాదాపు అన్ని షిప్‌మెంట్లపై తప్పనిసరి కస్టమ్స్ సుంకాలు విధించారు.
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ద్వారా అధికారం పొందిన రవాణా క్యారియర్లు, అర్హత కలిగిన పార్టీల కోసం కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. దాంతో ఇండియా పోస్ట్ ఆగస్టు 25, 2025 నుంచి యూఎస్‌కు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇదీ చదవండి: ఓ మై గోల్డ్!