కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన

Indian Parents Worried About Their Children In Canada - Sakshi

ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయపడుతున్నారు. జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని కలత చెందుతున్నారు. 

కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు ఏదైనా హెల్ప్‌లైన్ క్రియేట్ చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ కోరారు. ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

'నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా నా కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.' అని భల్విందర్ సింగ్ చెప్పారు. 

'నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలి' అని కుల్‌దీప్ కౌర్ కోరారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది.

అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top