
అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు చివరి సందేశం
నేడు ఐఎస్‌ఎస్ నుంచి బయలుదేరనున్న నలుగురు వ్యోమగాములు
రేపు కాలిఫోర్నియా తీరంలో దిగనున్న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) సోమవారం వీడ్కోలు పలుకబోతున్నారు. ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ అస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా 18 రోజుల తన అంతరిక్ష యాత్ర ముగించుకొని సహచర వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగిరాబోతున్నారు. యాక్సియోమ్ మిషన్–4(ఏఎక్స్–4) ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆదివారం ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు.
‘‘భారతదేశం ఈరోజు అంతరిక్షం నుంచి నిర్భయంగా, పూర్తి విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోంది. సారే జహాసె ఆచ్ఛా ఇండియా. ఇదొక అద్భుతమైన, నమ్మశక్యంకాని ప్రయాణం. ఐఎస్‌ఎస్‌లో అంతరిక్ష ప్రయోగాల్లో ఈరోజు నా వ్యక్తిగత అధ్యాయం ముగిసింది. కానీ, భారతీయ అంతరిక్ష సంస్థ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మనమంతా కలిసి పని చేస్తే అనుకున్నది సాధించగలం.
భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాల కోసం మనం ఐక్యంగా కృషి చేయాలి. పరస్పరం సహకరించుకోవాలి. ఈ ప్రయోగం సఫలం కావడానికి, నేను ఇక్కడికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఐఎస్‌ఎస్‌లో నిష్ణాతులైన సహచర వ్యోమగాములతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వారు నా అంతరిక్ష యాత్రను అందమైన అనుభూతిగా మార్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూమిని వీక్షించడం ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది.
భూమిని చూసిన ప్రతిసారీ మాయజాలాన్ని చూస్తున్నట్టే ఉంది. నాకు అన్ని విధాలా మద్దతుగా నిలిచిన ఇస్రో, నాసా సైంటిస్టులకు కృతజ్ఞతలు. ఇలాంటి అంతరిక్ష యాత్రలు కేవలం శాస్త్రీయ పరిశోధనలకే కాకుండా మన దేశాలకు, మానవాళి ప్రగతికి తోడ్పడతాయి’’ అని శుభాంశు శుక్లా ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సహచర వ్యోమగాములు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. శుభాంశు శుక్లాతోపాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్‌నాన్‌స్కీ–విస్నీవ్‌స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు సైతం మాట్లాడారు. తమ అనుభవాలు పంచుకున్నారు.
→ ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా గత నెల 26న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్‌నాన్‌స్కీ–విస్నీవ్‌స్కీ, టిబోర్ కపు బయలుదేరిన సంగతి తెలిసిందే.
→ ఐఎస్‌ఎస్ నుంచి వీరు ఇప్పటిదాకా భూగోళాన్ని 250 సార్లు చుట్టేశారు. భూమి చుట్టూ 96,56,064 కిలోమీటర్లు ప్రయాణించారు.
→ అంతరిక్ష కేంద్రంలో 60 రకాల శాస్త్రీయ ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి కీలకమైన సమాచారం అందించారు.
→ స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్‌ఎస్ నుంచి శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్‌నాన్‌స్కీ–విస్నీవ్‌స్కీ, టిబోర్ కపు భూమిపైకి తిరిగిరాబోతున్నారు. వారి రిటర్న్ షెడ్యూల్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారికంగా ధ్రువీకరించింది.
→ భారత అంతరిక్ష ప్రయోగాల్లో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న మొదటి భారతీయుడిగా ఆయన రికార్డుకెక్కారు. ఆయన ప్రయా ణం కొత్త తరం భారతీయ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ఘనస్వాగతానికి ఏర్పాట్లు
→ అంతరిక్ష యాత్ర పూర్తికావడంతో నలుగురు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఐఎస్‌ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకుంటారు. ప్రి–ఫ్లైట్ తనిఖీలు నిర్వహిస్తారు.
→ అమెరికాలోని కాలిఫోరి్నయా సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పసిఫిక్ సముద్ర తీరంలో నలుగురు వ్యో మగాములు భూమిపై దిగే అవకాశం ఉంది.
→ అమెరికాలో ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి చేరుకొనే శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం పలకడానికి ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి.