
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈరోజు(శనివారం) సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగా, దీన్ని భారత కూడా ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ముగింపు దొరికింది.
అనంతరం ఇండియన్ ఆర్మీ.. ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘ దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల యుద్ధంలో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాక్ తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. భారత్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు అసత్య ప్రచారం చేశారు.
పాక్ చెప్పినట్లు.. భారత్ ఆర్మీకి ఏమీ నష్టం జరగలేదు. భారత సైన్యం.. పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి, పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. బారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది’ అని భారత ఆర్మీ స్పష్టం చేసింది.
భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ
భారత్-పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం(శనివారం, మే10) 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.
ట్రంప్ పెద్దన్న పాత్ర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్రలో ఇరు దేశాల మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. కాల్పుల విరమణకు అమెరికాను పాకిస్తాన్ ఆశ్రయించడంతో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి భారత్‌తో చర్చించారు. దీనికి భారత్ కూడా అంగీకరించి మే 12వ తేదీన పాక్‌తో చర్చలకు సిద్ధమైంది.