వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు | india summons us diplomat again after missile strike on indian crewed | Sakshi
Sakshi News home page

వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు

Jun 12 2026 5:07 PM | Updated on Jun 13 2026 1:13 PM

india summons us diplomat again after missile strike on indian crewed

సాక్షి, ఢిల్లీ: హర్ముజ్‌ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్‌ సీరియస్‌ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. 

ఇటీవల భారత్‌కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్‌ సమీపంలోని హర్మూజ్‌ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్‌ సీరియస్ అయ్యింది..

ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్‌లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్‌ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.

భారతీయ నావికులే టార్గెట్‌గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.

కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement