
అమెరికా భారీ సుంకాలపై భారత్ గట్టి కౌంటర్‌కు సిద్ధమైంది. అగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం.
డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అందుకు ట్రంప్ భారత్‌పై విధించిన భారీ సుంకాలే కారణం. భారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్‌పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్‌పై తీవ్రంగా స్పందించేందుకు ఇప్పుడు సిద్ధమైంది.
రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్‌కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే..
ఈ నెల చివర్లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో ఐదురోజులపాటు పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలోనే అగ్రరాజ్యంతో భారత్ భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దు అయినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ-ట్రంప్ సమావేశంలో పలు ఒప్పందాలు ప్రకటించారు. బోయింగ్ P8I విమానాలు, Stryker యుద్ధ వాహనాలు, Javelin యాంటీ-ట్యాంక్ మిసైళ్లు కొనుగోలు అందులో ఉన్నాయి. సుమారు 3.6 బిలియన్ డాలర్ల(రూ.31 వేల కోట్లు) విలువైన ఆ రక్షణ ఒప్పందాలు రాజ్‌నాథ్ అమెరికా పర్యటనలో కుదరాల్సి ఉంది.
అయితే. ట్రంప్ టారిఫ్ వడ్డన నేపథ్యంలో ఈ ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నాయని రక్షణ శాఖకు చెందిన అధికారులిద్దరు వ్యాఖ్యానించారు. రాతపూర్వకంగా అమెరికా నుంచి కొత్త ఆయుధాల కొనుగోళ్ల నిలిపివేతపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని, అయినప్పటికీ ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఒప్పందం రద్దు కాలేదని.. తాత్కాలికంగా నిలిచిపోయిందని.. ఇప్పుడు కొనసాగుతున్న ఒప్పందాలు యధాతథంగా కొనసాగుతాయని.. టారిఫ్‌ల నిర్ణయం ఓ కొలిక్కి వచ్చాక ద్వైపాక్షిక సంబంధాల దిశపై స్పష్టత వచ్చిన కొత్త ఒప్పందాల అడుగులు ముందుకుపడే అవకాశం కనిపిస్తోందని ఆ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చింది. దీనిపై ఇటు భారత రక్షణ మంత్రిత్వ శాఖ.. అటు పెంటగాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.