భారత్‌లో ఆకలి కేకలు | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఆకలి కేకలు

Published Sun, Oct 18 2020 3:46 AM

India Ranks 94 Among 107 Countries in Global Hunger Index - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్రతరమయ్యాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానంలో నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌లు ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్‌ ర్యాంకింగ్‌లు సాధించాయి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జీహెచ్‌ఐ) ఈ ఏడాది నివేదికను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచీని రూపొందిస్తారు.

► భారత్‌ (94 ర్యాంకు), బంగ్లాదేశ్‌ (75), మయన్మార్‌ (78), పాకిస్తాన్‌ (88) స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది
► నేపాల్‌ 73, శ్రీలంక 64 ర్యాంకుల్ని సాధించి ఆకలి సమస్య మధ్యస్తంగా ఉన్న దేశాల జాబితాలో చేరాయి.
► గత ఏడాది 117 రాష్ట్రాలకు భారత్‌ 102వ స్థానంలో ఉంటే ఈసారి మెరుగుపడింది.
► భారత్‌లో 14% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు
► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 37.4% మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి.
► అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 17.3% మంది ఎత్తుకి తగ్గ బరువు లేరు
► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 3.7%మంది మృత్యువాత పడుతున్నారు.

దేశంలో ఈ పరిస్థితికి కారణాలివీ..
► అందరికీ ఆహారం పంపిణీ విధానంలో లోపాలు
► ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యపూరిత వైఖరితో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం
► పౌష్టికాహార లోపాలు అరికట్టడానికి సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం
► ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌ వంటి అతి పెద్ద రాష్ట్రాలు పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం
► నిరక్షరాస్యులే తల్లులుగా మారడం, వారిలో రక్తహీనత లోపాలు


ఆ రాష్ట్రాలు దృష్టి పెట్టాలి
భారత్‌లో ప్రీమెచ్యూర్‌ జననాలు, తక్కువ బరువుతో బిడ్డ జన్మించడం వంటివి అధికంగా జరుగుతున్నాయని, యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మారితేనే ప్రపంచ ఆకలి సూచీలో మన ర్యాంకు మెరుగుపడుతుందని అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థకి చెందిన సీనియర్‌ అధ్యయనకారిణి పూర్ణిమ మీనన్‌ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో మహిళల్లో విద్య, గర్భస్థ మహిళలకి పౌష్టికాహారం ఇవ్వడం, తల్లి కాబోయే మహిళల్లో పొగాకు తాగే అలవాటుని మానిపించడం వంటివి చేయాలని ఆమె చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement