breaking news
hunger cry
-
తూకం కాదు... సమతూకం ఉండాలి
పోషకాహారం అంటే అత్యంత ఖరీదైన ఆహారం అని కాదు. అలాగని కేవలం ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే ఆహారమూ కాదు. రుచితో పాటు పోషక విలువలు ఉండాలి. అంతకు ముందు మన శరీరానికి ఎలాంటి ఆహారం కావాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందిస్తే అవి ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే సమతుల ఆహారంపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతుంటారు. మనం తీసుకునే ఆహారం రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. శరీర ఎదుగుదలకు ముఖ్యంగా పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి సరైన పోషకాలు ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని పోషకాలు మన మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగు పరచటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తోపాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తాయి.కార్బోహైడ్రేట్లు మన శరీరానికి తప్పక కావాల్సిందే. అవి తృణధాన్యాలు, కూరగాయలలో లభిస్తాయి. శక్తికి, హార్మోన్ల ఉత్పత్తికి ఐరన్ తప్పక అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు మేలు చేస్తాయి.ప్రోటీన్లు కండరాలకు, హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలలో లభిస్తాయి. విటమిన్లు శరీరంలోని రసాయన చర్యలకు సహాయపడతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలలో లభిస్తాయి. మినరల్స్ ద్వారా ఎముకల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా నరాల పనితీరుకు క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ముఖ్యమైనవి. రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనంగా అవుతారు. త్వరగా నీరసం వస్తుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, గోంగూర వంటి ఆకుపచ్చ కూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరం లో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. పిల్లలకు వారి వయసు, యాక్టివిటీని బట్టి 1000 నుంచి 1400 కిలో క్యాలరీలు అవసరం అవుతాయి. పెద్ద పిల్లలైతే 1800 కిలో క్యాలరీల వరకు తీసుకోవచ్చు. ఎదిగే వయసు కాబట్టి జంక్‌ఫుడ్ కాకుండా రోజువారీ భోజనంలో మొలకెత్తిన గింజలు, చేపలు, గుడ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవ్వాలి. చిన్నపిల్లలైతే రోజుకు 4 గ్లాసులు, పెద్దపిల్లలైతే 12 గ్లాసుల వరకు నీళ్లు తాగేలా చూడాలి. వాతావరణం బట్టి నీటి మోతాదులో మార్పులు ఉండవచ్చు. ప్రతి అరగంటలకు ఒకసారి నీళ్లు కొద్దిగానైనా తాగేలా సూచనలు ఇవ్వాలి. -
గాజాలో అన్నమో రామచంద్రా!
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది. ప్రాణాలకు తెగిస్తేనే.. ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు. ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది. అభాగ్యుల ఎదురుచూపులు ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్‌లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్‌గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు. నిండిపోయిన ఆసుపత్రులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.ప్రపంచ దేశాలు స్పందించాలి గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాలో... ఆకలి కేకలు!
గాజా: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంపై మెరుపుదాడి చేపట్టిన హమాస్ ఇతర జిహాదీలు 1,195 మందిని చంపేయడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకుపోయారు. ఆ ఒక్క ఘటన..దశాబ్దాలుగా శరణార్థులుగా సొంత ప్రాంతంలోనే బతుకులీడుస్తున్న పాలస్తీనా ప్రజలను అత్యంత తీవ్రమైన కష్టాల్లోకి నెట్టివేసింది. శక్తివంతమైన ఇజ్రాయెల్ సైన్యం ఆ రోజు నుంచి గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తూ 50 వేల మందిని పొట్టనబెట్టుకోవడంతోపాటు సుమారు లక్షన్నర మందిని క్షతగాత్రులుగా మార్చేసింది. జిహాదీ గ్రూపులు బందీలను విడుదల చేయలేదనే సాకుతో గాజాను కొన్ని నెలలుగా పూర్తిగా దిగ్బంధంలో ఉంచింది. నీరు, ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలను సైతం అందకుండా చేసింది. దీంతో ఈ ఆ ప్రాంతంలోని 22% మంది, 4.70 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అత్యంత కీలకమైన ఆస్పత్రులు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆస్పత్రుల్లో వసతులు, మందులు కరువై సరైన వైద్యం అందక, మహిళలు, చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. మంచి నీరు, ఇంధన సరఫరాను సైతం నిలిపివేసింది. డీహైడ్రేషన్, డయేరియా, హెపటైటిస్ వంటి వాటితో జనం, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా ప్రాంతంలోని 90 శాతం నివాసాలను నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేసింది. నేలమట్టమైన భవనాల శిథిలాలు, అపరిశుభ్రత మధ్యనే పాలస్తీనియన్లు భయంభయంగా బతుకుతున్నారు. ఐరాస సారథ్యంలో నడుస్తున్న ఆహార పంపిణీ కేంద్రాల నుంచి నిల్వలు హమాస్‌కు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఇజ్రాయెల్ మూసివేయించింది. రెండు నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్ సారథ్యంలో ఆహార పంపిణీ కేంద్రాలు పరిమితంగా ఏర్పాటయ్యాయి. ఇక్కడ సైతం అన్నార్తులు తుపాకీ కాల్పులకు గురికాక తప్పడం లేదు. రోజూ పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ‘గాజాలో మానవీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే లక్షలాది మంది ఆకలి చావులకు గురికాక తప్పదు’అని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజా స్ట్రిప్‌లోని 20 లక్షల మంది ప్రజల ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఇజ్రాయెల్‌కు హితవు పలుకుతోంది. భూమిపై నరకం గాజా భూమిపై నరకం కంటే అధ్వానంగా గాజా ప్రాంతం తయారైందని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్‌జరిక్ వ్యాఖ్యానించారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు, పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు, బందీలను వదిలిపెట్టేందుకు ప్రపంచ దేశాలు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను పట్టించుకోవడం లేదు. పాలస్తీనియన్లకు కనీస మానవీయమైన గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదు. గాజాలో చట్టపరమైన, నైతిక, మానవీయ ప్రమాణాల ఉల్లంఘన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. -
గాజాలో ఆకలి కేకలు
ఇజ్రాయెల్ దిగ్బంధంలో ఉన్న గాజాలో పాలస్తీనియన్లు పడుతున్న అంతులేని అగచాట్లకు నిదర్శనం ఈ ఫొటోలు. కనీసం ఆహారం సైతం దొరక్క వాళ్లు అలమటిస్తున్నారు. శుక్రవారం ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం సమీపంలోని ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఆహారం కోసం ఇలా పోటీ పడ్డారు. వారి దురవస్థ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తీవ్రత నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఐరాస సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. దాంతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలాకాలంగా వారంతా ఐరాస సాయంపైనే ఆధారపడి బతుకీడుస్తూ వస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం ఖాయమంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంతటి కారుచీకట్లలోనూ ఒక కాంతిరేఖ మిణుకుమంటోంది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలైనట్టు హమాస్ ప్రతినిధి బస్సెమ్ నయీమ్ తాజాగా చెప్పారు. పరస్పరం బందీల విడుదలతో 14 నెలల పై చిలుకు యుద్ధానికి త్వరలోనే ముగింపు వస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు. -
Israel-Hamas war: గాజాలో ఆకలి కేకలు
గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు. 80 శాతం మంది గాజావాసులు ఇజ్రాయెల్ దాడులకు తాళలేక, దాని బెదిరింపులకు తలొగ్గి ఇప్పటికే ఇల్లూ వాకిలీ వదిలేశారు. కొద్ది నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎలాంటి సహాయక సామగ్రినీ ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో అన్నమో రామచంద్రా అంటూ అంతా అలమటిస్తున్నారు. వారిలోనూ కనీసం 5 లక్షల మంది అత్యంత తీవ్రమైన కరువు బారిన పడ్డారని ఐరాస ఆవేదన వెలిబుచ్చింది. తాళలేని ఆకలిబాధతో దుర్భర వేదన అనుభవిస్తున్నారని ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) తాజా నివేదికలో వెల్లడించింది. వారికి తక్షణ సాయం అందకపోతే అతి త్వరలోనే గాజా ఆకలిచావులకు ఆలవాలంగా మారడం ఖాయమని హెచ్చరించింది... నరకానికి నకళ్లు... గత ఆదివారం గాజా శరణార్థి శిబిరంలో ఓ రెణ్నెల్ల పసివాడు ఆకలికి తాళలేక మృత్యువాత పడ్డాడు. గాజాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చని ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు అక్కడ పదులు, వందలు, వేలల్లో, అంతకుమించి ఆకలి చావులు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నాయి. ప్రతీకారేచ్ఛతో పాలస్తీనాపై నాలుగున్నర నెలలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆ క్రమంలో గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేయడమే ఇందుకు కారణం. గాజాకు ఆహారం, నిత్యావసరాల సరఫరాను కూడా ఇజ్రాయెల్ వీలైనంతగా అడ్డుకుంటూ వస్తోంది. చివరికి ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కూడా అనుమతించడం లేదు. దాంతో గాజావాసులు అల్లాడిపోతున్నారు. శరణార్థి శిబిరాలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. కొన్నాళ్లుగా ఆకలి కేకలతో ప్రతిధ్వనిస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలినాళ్లలో గాజాలోకి రోజుకు 500 పై చిలుకు వాహనాల్లో సహాయ సామగ్రి వచ్చేది. క్రమంగా 50 వాహనాలు రావడమే గగనమైపోయింది. ఇప్పుడవి 10కి దాటడం లేదు! ఉత్తర గాజాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతానికి ఎలాంటి మానవతా సాయమూ అందక ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. యూఎన్ఆర్డబ్ల్యూఏ కూడా చివరిసారిగా జనవరి 23 అక్కడికి సహాయ సామగ్రిని పంపింది. నాటినుంచి ఇజ్రాయెల్ ఆంక్షలు తీవ్రతరం కావడంతో చేతులెత్తేసినట్టు సంస్థ చీఫ్ ఫిలిప్ లాజరిని స్వయంగా అంగీకరించారు! గాజా ఆకలి కేకలను పూర్తిగా మానవ కలి్పత సంక్షోభంగా ఆయన అభివరి్ణంచారు. ‘‘సహాయ సామగ్రితో కూడిన వాహనాలేవీ గాజాకు చేరకుండా చాలా రోజులుగా ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకుంటోంది. కనీసం ఆహార పదార్థాలనైనా అనుమతించాలని కోరినా పెడచెవిన పెడుతోంది’’ అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. కలుపు మొక్కలే మహాప్రసాదం ఆకలికి తట్టుకోలేక గాజావాసులు చివరికి కలుపు మొక్కలు తింటున్నారు! ఔషధంగా వాడాల్సిన ఈ మొక్కలను ఆహారంగా తీసుకుంటే ప్రమాదమని తెలిసి కూడా మరో దారి లేక వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మాలో అని పిలిచే ఈ మొక్కలను కట్టకింత అని రేటు పెట్టి మరీ అమ్ముకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకలికి తాళలేక గుర్రాల కళేబరాలనూ తింటున్నారు! మాటలకందని విషాదం... యూఎన్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఓసీహెచ్ఏ) గణాంకాల మేరకు గాజాలోని మొత్తం 23 లక్షల మందినీ తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. వారిలోనూ ► లక్షల మందికి పైగా తీవ్రమైన కరువు పరిస్థితుల బారిన పడ్డారు. ఇజ్రాయెల్ వైఖరే ఇందుకు ప్రధాన కారణం... ► గాజాలోకి సహాయ సామ్రగి కోసం ఇజ్రాయెల్ కేవలం ఒకే ఒక ఎంట్రీ పాయింట్‌ను తెరిచి ఉంచింది. ► ఆ మార్గంలోనూ దారిపొడవునా లెక్కలేనన్ని చెక్ పాయింట్లు పెట్టి ఒక్కో వాహనాన్ని రోజుల తరబడి తనిఖీ చేస్తోంది. ► దీనికి తోడు అతివాద ఇజ్రాయెలీ నిరసనకారులు పాలస్తీనా వాసులకు సాయమూ అందడానికి వీల్లేదంటూ భీష్మించుకున్నారు. ► దక్షిణ గాజా ఎంట్రీ పాయింట్‌ను కొన్నాళ్లుగా వారు పూర్తిగా దిగ్బంధించారు. ► సహాయక వాహనాలకు భద్రత కలి్పస్తున్న స్థానిక పోలీసుల్లో 8 మంది ఇటీవల ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు. అప్పట్నుంచీ ఎస్కార్టుగా వచ్చే వారే కరువయ్యారు. ► దాంతో గాజాలో సహాయక వాహనం కనిపిస్తే చాలు, జనమంతా ఎగబడే పరిస్థితి నెలకొని ఉంది! వాహన సిబ్బందిని చితగ్గొట్టి చేతికందినన్ని సరుకులు లాక్కెళ్తున్నారు. ► మరోవైపు దీన్ని సాకుగా చూపి ఇజ్రాయెల్ సహాయ వాహనాలను అడ్డుకుంటోంది. ► గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి వందల మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. యుద్ధానికి కారణంగా నిలిచిన ఈ దాడిలో ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) సిబ్బంది పాత్రా ఉందని ఇటీవల తేలడంతో ఆ సంస్థ గాజా నుంచి దాదాపుగా వైదొలగింది. సహాయక సామగ్రి చేరవేతలో ఇన్నాళ్లూ వ్యవహరించిన ఆ సంస్థ నిష్క్రమణతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Afghan Crisis: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు
అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్‌కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు. బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫర్నీచర్ అమ్ముకుని మరీ.. ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఆధారపడడం వల్లే! అఫ్గనిస్తాన్ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్ కేంద్రీయ బ్యాంక్‌కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్ సెక్టార్.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్ పాలనలో అఫ్గన్ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్‌డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్, ఖతర్, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్‌లో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్ యూనియన్లు.. అఫ్గన్ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కోవిడ్‌తో నిమిషానికి ఏడుగురు.. ‘ఆకలి వైరస్’కు 11 మంది
కైరో: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, గ్లోబల్ వార్మింగ్, అంతర్యుద్ధ పరిస్థితులు ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. తినడానికి తిండి లేక ఆకలిబాధతో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది మరణిస్తున్నట్టుగా పేదరిక నిర్మూలనపై కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘‘ది హంగర్ వైరస్ మల్టిప్లైస్’’ అన్న పేరుతో ఆక్స్‌ఫామ్ సంస్థ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారితో నిమిషానికి ఏడుగురు మరణిస్తూ ఉంటే, అదే సమయంలో ఆకలి బాధ తట్టుకోలేక నిమిషానికి 11 మంది మరణించడం హృదయ విదారకర పరిస్థితులకు అద్దం పడుతోందని ఆ సంస్థ సీఈఓ అబ్బీ మ్యాక్స్‌మ్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ గణాంకాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మన ఊహకి కూడా అందని దుర్భర పరిస్థితుల్ని ఎందరో ఎదుర్కొంటున్నారు. అంతర్యుద్ధాలు, పర్యావరణ మార్పులతో ఏర్పడే విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు కోట్లాది మందిని తిండికి దూరం చేశాయి’’ అని ఆయన అన్నారు. ‘‘మార్కెట్లపై బాంబులు వేస్తున్నారు. పండిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో దుర్భర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఆకలిని పెంచేస్తున్నాయి. ఇలాంటి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది’’ అని మ్యాక్స్‌మ్యాన్ అన్నారు. నివేదికలో అంశాలివే.. ► ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 2 కోట్లు పెరిగింది. ► ఆహార కొరతని ఎదుర్కొంటున్న వారిలో దాదాపుగా 66% మంది మిలటరీ సంక్షోభం నెలకొన్న దేశాల్లోనే ఉన్నారు ► కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో 5,20,000 మంది ఆకలితో నకనకలాడిపోతున్నారు ► కోవిడ్–19 ప్రభావం, వాతావరణ మార్పులతో గత ఏడాదికాలంలోనే ఆహార ఉత్పత్తుల ధరలు 40% పెరిగాయి ► గత ఏడాది కాలంలో ప్రపంచ దేశాల్లో కరువు పరిస్థితులు ఆరు రెట్లు పెరిగిపోయాయి ► కరోనా కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై చేసే ఖర్చు 5,100 కోట్ల డాలర్లు పెరిగింది. ఆకలి కేకల్ని నిర్మూలించడానికి ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన ఖర్చు కంటే మిలటరీపై చేస్తున్న ఖర్చు ఆరు రెట్లు ఎక్కువ. ► అఫ్గానిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ దేశాల్లో ఆకలి కేకలు అత్యధికంగా ఉన్నాయి. -
భారత్‌లో ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్రతరమయ్యాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానంలో నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌లు ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్ ర్యాంకింగ్‌లు సాధించాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) ఈ ఏడాది నివేదికను తన వెబ్సైట్లో ఉంచింది. పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచీని రూపొందిస్తారు. ► భారత్ (94 ర్యాంకు), బంగ్లాదేశ్ (75), మయన్మార్ (78), పాకిస్తాన్ (88) స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది ► నేపాల్ 73, శ్రీలంక 64 ర్యాంకుల్ని సాధించి ఆకలి సమస్య మధ్యస్తంగా ఉన్న దేశాల జాబితాలో చేరాయి. ► గత ఏడాది 117 రాష్ట్రాలకు భారత్ 102వ స్థానంలో ఉంటే ఈసారి మెరుగుపడింది. ► భారత్‌లో 14% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు ► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 37.4% మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి. ► అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 17.3% మంది ఎత్తుకి తగ్గ బరువు లేరు ► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 3.7%మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలో ఈ పరిస్థితికి కారణాలివీ.. ► అందరికీ ఆహారం పంపిణీ విధానంలో లోపాలు ► ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యపూరిత వైఖరితో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ► పౌష్టికాహార లోపాలు అరికట్టడానికి సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం ► ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి అతి పెద్ద రాష్ట్రాలు పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ► నిరక్షరాస్యులే తల్లులుగా మారడం, వారిలో రక్తహీనత లోపాలు ఆ రాష్ట్రాలు దృష్టి పెట్టాలి భారత్‌లో ప్రీమెచ్యూర్ జననాలు, తక్కువ బరువుతో బిడ్డ జన్మించడం వంటివి అధికంగా జరుగుతున్నాయని, యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మారితేనే ప్రపంచ ఆకలి సూచీలో మన ర్యాంకు మెరుగుపడుతుందని అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థకి చెందిన సీనియర్ అధ్యయనకారిణి పూర్ణిమ మీనన్ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో మహిళల్లో విద్య, గర్భస్థ మహిళలకి పౌష్టికాహారం ఇవ్వడం, తల్లి కాబోయే మహిళల్లో పొగాకు తాగే అలవాటుని మానిపించడం వంటివి చేయాలని ఆమె చెప్పారు. -
ప్రపంచంలో పెరుగుతున్న ఆకలి కేకలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వరుసగా మూడో సంవత్సరం సరైన ఆహారం అందుబాటులో లేక ఆకలి కేకలు పెరిగాయి. 2016 సంవత్సరం నుంచి ఆహారం అందుబాటులేని వారి సంఖ్య అదనంగా 1.5 పెరిగింది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారం అందుబాటులో లేనివారి సంఖ్య 82 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వార్షిక ఆహార భద్రతా నివేదిక వెల్లడించింది. పదేళ్ల క్రితం ప్రపంచంలో ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉండేవో ఇప్పుడు ఆ స్థాయికి చేరకున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది. పౌష్టికాహార లోపంతో పుడుతున్న పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు సరైన ఆహారం అందుబాటులోలేక అలమటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోని మహిళలు పిల్లలనుకనే వయస్సులో పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఓ మహిళ పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి 2014 వరకు వరుసగా ఆహార కొరత తగ్గుతూ రాగా, 2015 నుంచి మళ్లీ కొరత అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని, దీనికి వాతావరణ మార్పులే కారణమని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. ఆహార కొరత కారణంగా ప్రాంతీయ అస్థిరతలు, అలజడి పెరిగి సంఘర్షణలు కూడా జరుగుతాయని హెచ్చరించింది. మధ్య అమెరికాలో కరువు పరిస్థితులు తలెత్తి పంటల దిగుబడి తగ్గడంతో అమెరికా సరిహద్దుల్లో వలసల అలజడి మొదలైందని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత యాభై ఏళ్లుగా భూ వాతావరణం వేడెక్కుతూ వస్తోందని, ముఖ్యంగా 2014, 2015, 2016 సంవత్సరాల్లో భూ వాతావరణం గణనీయంగా వేడెక్కిందని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పడుతున్నాయని తెలిపింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం ఉండాలని, ఆ విషయమై వ్యవసాయ రంగంలో ఆధునిక పరిశోధనలు పెరగాలని సమితి అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో పరిశోధనల కోసం ప్రపంచ దేశాలు కేవలం మూడు శాతం ఆర్థిక వనరులను ఖర్చు చేయడం శోచనీయమని సమితి అభిప్రాయపడింది. -
మైనార్టీ వసతిగృహంలో ‘ఆకలి కేకలు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైనారిటీ విద్యార్థులు సంకటంలో పడ్డారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. సర్కారు నెలవారీగా విడుదల చేసే మెస్ చార్జీల బిల్లులు ఏడాది కాలంగా పేరుకుపోవడంతో విద్యార్థులు తిండి కోసం వీధిన పడ్డారు. జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ సమీపంలో పోస్టుమెట్రిక్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఈ వసతి గృహంలో వసతి కలిస్తారు. ఇలా వసతి పొందే విద్యార్థులకు ప్రతి నెల మెస్ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి రూ.1050 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏడాదిగా మెస్ చార్జీలు లేవ్.. బండ్లగూడలోని మెనార్టీ వసతి గృహంలోని 50 మందికి వసతి కల్పించే సదుపాయం ఉంది. ఈ విద్యార్థులకు ఏడాది కాలంగా మెస్ చార్జీలు అందడంలేదు. సాధారణంగా నెలవారీగా విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లిస్తేనే.. వాటితో నెలకు సరిపడా సరుకులు తెచ్చుకోవడం.. వంట చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏడాది కాలంగా ఈ విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లించకపోవడంతో స్నేహితుల వద్ద భోజనం చేయడమో.. లేక పస్తులు ఉండాల్సివస్తోందని షాకీర్ అనే విద్యార్థి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు రూ. 3.6 లక్షలు.. మైనార్టీ వసతి గృహంలోని విద్యార్థులకు ఏడాది కాలంగా మెస్ చార్జీలు ఇవ్వకపోవడంతో బకాయిలు రూ. 3.6 లక్షలకు చేరాయి. మరోవైపు వసతిగృహంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది 50 మంది విద్యార్థుల్లో 15 ఖాళీలు ఏర్పడినా.. కొత్త విద్యార్థులను చేర్చుకునే పరిస్థితి లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ స్విచ్ఆఫ్ రావడం గమనార్హం.