
వెంటాడుతున్న ఆహార కొరత, పౌష్టికాహార లోపం
తిండి లేక 111 మంది మృతి... 80 మందికిపైగా చిన్నారులే
మానవతా సాయంపై ఇజ్రాయెల్ ఆంక్షలు
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది.
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది.
ప్రాణాలకు తెగిస్తేనే..
ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు.
ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్‌ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు.
ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్‌ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది.
అభాగ్యుల ఎదురుచూపులు
ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్‌లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్‌గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు.
నిండిపోయిన ఆసుపత్రులు
పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు.
ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.
ప్రపంచ దేశాలు స్పందించాలి
గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి.
సాక్షి, నేషనల్ డెస్క్