breaking news
Four childrens
-
గాజాలో అన్నమో రామచంద్రా!
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది. ప్రాణాలకు తెగిస్తేనే.. ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు. ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది. అభాగ్యుల ఎదురుచూపులు ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్‌లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్‌గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు. నిండిపోయిన ఆసుపత్రులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.ప్రపంచ దేశాలు స్పందించాలి గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్‌లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
భర్త ఇంటికి వచ్చేసరికి భార్యతో సహా పిల్లలు..
సాక్షి ,చాంద్రాయణగుట్ట( హైదరాబాద్) : నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్ కాలనీ ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీ, అతియా బేగం (29) దంపతులు. వీరికి తన్వీర్ బేగం (13), మహ్మద్ హైదర్ (12), మహ్మద్ సోహేల్ (10), మెహాక్ బేగం (8) సంతానం. కాగా ఈ నెల 4న భర్త మహ్మద్ రఫీ తన సోదరుణ్ని వదిలేందుకు గుల్బార్గాకు వెళ్లాడు. అనంతరం ఈ నెల 5వ తేదీ రాత్రి 6.30 గంటలకు రఫీ తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్యతో పాటు నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారు. దీంతో భార్యకు ఫోన్‌ను చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు చెందిన రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854763 నంబర్లో సంప్రదించాలన్నారు. ( చదవండి: కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య ) -
నలుగురు చిన్నారులను మింగిన కుంట
కందుకూరు: భారీ వర్షాలతో జలకళ సంతరించుకున్న కుంటను చూసేం దుకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ అనుబంధ గ్రామం మహ్మద్ నగర్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుత్పల భిక్షపతి, యాదమ్మ దంపతులకు గణేశ్, శివ, కుమార్తె శిల్ప ఉన్నారు. గణేశ్ డిగ్రీ చదువుతుండగా, శిల్ప(14), శివ (13) కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 9, 7 తరగతులు చదువుతున్నారు. వీరి తండ్రి భిక్షపతి ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లే కూలీనాలీ చేస్తూ పిల్లల్ని పోషించుకుంటోంది. భిక్షపతి చిన్నాన్న లక్ష్మయ్య కూతురు సుశీల, ఈశ్వర్ దంపతులకు సృజన్ (13), మదన్ కుమార్ అలియాస్ బన్నీ(10) ఉన్నారు. కందుకూరు చౌరస్తాలోని ఎస్‌వీవీఆర్ స్కూల్లో వీరు 7, 6 తరగతులు చదువుతున్నారు. ఈశ్వర్ భార్యాపిల్లలను వదిలేసి చాలా ఏళ్ల క్రితమే ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సుశీల పుట్టింట్లోనే ఉంటూ కూలిపనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. గురువారం మధ్యాహ్నం శిల్ప, శివ, సృజన్ , మదన్ కుమార్‌తోపాటు గ్రామానికి చెందిన దశరథ కుమార్తెలు సంధ్య, సబిత, జంగయ్య కుమారుడు వంశీ కలసి గ్రామ సమీపంలో ఉన్న పోరుడోని కుంటలోకి వర్షానికి చేరిన నీటిని చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలో మట్టి అంటడంతో కాళ్లు కడుక్కుందామని కుంట వద్దకు వెళ్లగా.. ఇంటర్ చదివే సంధ్య వారిని వారించి పైకి రావాలని చెప్పింది. దీంతో ఆమె చెల్లెలు సబిత, వంశీ కట్టపైకి వచ్చారు. మిగతా నలుగురు శిల్ప, శివ, సృజన్ , మదన్ కుమార్ కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. దీంతో పైన ఉన్న ముగ్గురు గ్రామంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం తెలిపారు. అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో చిన్నారులను గాలించి బయటికి తీయగా అప్పటికే అందరూ విగతజీవులుగా కనిపించారు.