
జాతీయ పౌష్టికాహార వారోత్సవం
సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు
పోషకాహారం అంటే అత్యంత ఖరీదైన ఆహారం అని కాదు. అలాగని కేవలం ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే ఆహారమూ కాదు. రుచితో పాటు పోషక విలువలు ఉండాలి. అంతకు ముందు మన శరీరానికి ఎలాంటి ఆహారం కావాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందిస్తే అవి ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే సమతుల ఆహారంపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతుంటారు.
మనం తీసుకునే ఆహారం రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. శరీర ఎదుగుదలకు ముఖ్యంగా పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి సరైన పోషకాలు ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని పోషకాలు మన మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగు పరచటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తోపాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తాయి.
కార్బోహైడ్రేట్లు మన శరీరానికి తప్పక కావాల్సిందే. అవి తృణధాన్యాలు, కూరగాయలలో లభిస్తాయి. శక్తికి, హార్మోన్ల ఉత్పత్తికి ఐరన్ తప్పక అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు మేలు చేస్తాయి.
ప్రోటీన్లు కండరాలకు, హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలలో లభిస్తాయి. విటమిన్లు శరీరంలోని రసాయన చర్యలకు సహాయపడతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలలో లభిస్తాయి. మినరల్స్ ద్వారా ఎముకల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా నరాల పనితీరుకు క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ముఖ్యమైనవి. రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనంగా అవుతారు. త్వరగా నీరసం వస్తుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
బచ్చలి, పాలకూర, గోంగూర వంటి ఆకుపచ్చ కూరలు, బీట్‌రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరం లో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. పిల్లలకు వారి వయసు, యాక్టివిటీని బట్టి 1000 నుంచి 1400 కిలో క్యాలరీలు అవసరం అవుతాయి.
పెద్ద పిల్లలైతే 1800 కిలో క్యాలరీల వరకు తీసుకోవచ్చు. ఎదిగే వయసు కాబట్టి జంక్‌ఫుడ్ కాకుండా రోజువారీ భోజనంలో మొలకెత్తిన గింజలు, చేపలు, గుడ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవ్వాలి. చిన్నపిల్లలైతే రోజుకు 4 గ్లాసులు, పెద్దపిల్లలైతే 12 గ్లాసుల వరకు నీళ్లు తాగేలా చూడాలి. వాతావరణం బట్టి నీటి మోతాదులో మార్పులు ఉండవచ్చు. ప్రతి అరగంటలకు ఒకసారి నీళ్లు కొద్దిగానైనా తాగేలా సూచనలు ఇవ్వాలి.