
తల్లిపాల వారోత్సవాలు
వ్యాధులు దరిచేరకుండా శిశువులకు వ్యాక్సిన్లు వేయించడం తెలిసిందే. ప్రసవం అయిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం అంటే శిశువుకు మొదటి వ్యాక్సిన్ వేయించినట్టే అని చెబుతుంది భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రసవం తర్వాత మొదటి గంట ఎంత కీలకమైనదో తల్లికి– బిడ్డకి ఎన్ని విధాల మేలు చేస్తుందో తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడమనేది కాబోయే తల్లులు తప్పక తెలుసుకోవాల్సినదే.
అమ్మపాలే తన బిడ్డకు ఇచ్చే అమృతం. ఔషధం కూడా. నవజాత శిశువులకు మొదటి గంటలోనే రొమ్ము పాలు పట్టించడాన్ని ఓ మంచి ప్రారంభంగా చెప్పవచ్చు. తల్లిపాలు పిల్లలకు సహజ పోషకాహారం, సురక్షితమైనవి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు తాగడం లేదు అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లల ఆరోగ్యకరమైన భావి జీవితం సమస్యాత్మకంగా ఉంటుందనేది ఆ నివేదికల సారాంశం. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతి
ముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలెస్ట్రామ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది.
అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలని, మొదటి గంట మరీ కీలకం అని యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. ప్రసూతి అనారోగ్య భారం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబాల సృష్టికి మూలం అవుతుంది. బిడ్డకు అందమైన భవిష్యత్తును కానుకగా ఇవ్వాలని తపించే ప్రతి తల్లి మొదటగా అందివ్వాల్సింది తల్లిపాలే.
మరెన్నో ప్రయోజనాలు
→ ప్రసవం అయిన కొన్ని రోజుల వరకే కొలొస్ట్రామ్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ రోజుల్లో తప్పక పాలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ మనుగడ అవకాశాలు 14 రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి.
→ తల్లిపాలలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం.
→ తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలా వరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది.
ఆరు నెలలు... ఆ తర్వాత...
ఆరు నెలల తర్వాత ఇంట్లో వండిన పోషకాలు ఉండే మెత్తని ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే, వయస్సుకు తగిన విధంగా, పోషకాలు ఉండే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అదే సమయంలో రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడ తల్లిపాలు ఇవ్వచ్చు. బిడ్డ క్రమంగా ఘన, ద్రవ, వైవిధ్యమైన ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోగలుగుతుందా లేదా అని దృష్టి పెట్టాలి.
బిడ్డ తొలినాళ్ల నుంచే తీసుకున్న శ్రద్ధ ఆ బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి పునాది వేస్తుంది. తొలి బాల్య దశలోనే బిడ్డ ఏం నేర్చుకుంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది.. అనే వాటిని నిర్ణయిస్తుంది. జీవితంలో విజయాలు సాధించేలా వారి సామర్థ్యాన్ని ఆ తొలిదశే నిర్ణయిస్తుంది. పిల్లల మనుగడ, ఆరోగ్యకరమైన అభివృద్ధికి తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి.
మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్క అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శ్రక్తి ప్రదాయిని. సాధారణ, సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. ఈ విషయాన్ని తల్లికాబోయే ప్రతి ఒక్కరికీ చెబుతుంటాం. పాలు ఎలా పట్టాలి, శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు వృద్ధి చెందడానికి ఎలాంటి పోషకాలు గల ఆహారాన్ని తీసుకోవాలో వివరిస్తాం. ప్రతీ తల్లి తన బిడ్డ ఆరోగ్య భవిష్యత్తుకు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఇదే. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం లో తప్పనిసరి అవగాహన పెంచుకోవాలి. తల్లికి తగినంత మద్దతునివ్వాలి.
– డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్
∙