
ట్రంప్ దూకుడుకు కళ్లెం వేయనున్న భారత్
యుద్ధ విమానాలు కొనుగోలు చేయొద్దని నిర్ణయం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు భారత ప్రభుత్వం ప్రతిచర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం భారత్‌ను పునరాలో చనలో పడేశాయి. ట్రంప్ దూకుడుకు విరుగుడుగా అమెరికా నుంచి రక్షణ పరికరాల కొనుగోలును విరమించుకోవాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రధానంగా ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు తెలిసింది. ట్రంప్ ఇటీవల భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడి యాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియాపై అమెరికా అధ్యక్షుడి మాటల దాడి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్ ఆహ్వా నించి, విందు ఇచ్చారు. ఇండియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఒకవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని కచ్చితంగా తగ్గిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ పరిణామా లన్నీ భారత్‌కు ఇబ్బందికరంగా మారాయి.
అమెరికాతో చర్చలు జరుపలేదు
రక్షణ రంగంలో భారత్–అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధాలు, సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్–35 యుద్ధ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బ్లూబర్గ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులోనూ వీటిని కొనే అవకాశం లేదని పేర్కొంది.
మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాల కోసం అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరుపలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, వాణిజ్య లోటుపై ట్రంప్ అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం కొనుగోళ్లు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందుకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అమెరికాతో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అంచనా వేస్తోంది.