భారతీయ వాయుసేన (IAF) మాజీ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2030ల మధ్య నాటికి సర్వీసులోకి రానున్న 'తేజస్ ఎంకే-2' యుద్ధ విమానాలు ఫ్రంట్‌లైన్ పాత్రలో ఆపరేషనల్‌గా అంతగా ఉపయోగపడవని ఆయన స్పష్టం చేశారు .చైనా,పాక్ లు అత్యాధునిక 5,6వ తరగతి యుద్ధ విమానాలను సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, కేవలం 4వ తరగతికి చెందిన తేజస్ ఎంకే-2పై భారత్ పూర్తిగా ఆధారపడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో స్వదేశీ యుద్ధ విమానాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత సరిహద్దుల్లో వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, హెచ్‌ఏఎల్ (HAL) సంస్థ తీవ్రమైన జాప్యం ప్రదర్శిస్తోందని ఎయిర్ మార్షల్ మండిపడ్డారు. తేజస్ ఎంకే-1ఏ (Tejas Mk-1A) విమానాల సరఫరాలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, అమెరికాకు చెందిన జీఈ ఎఫ్404 ఇంజిన్ల డెలివరీలో వైఫల్యం విడిభాగాల అనుసంధాన సమస్యలే దీనికి కారణమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్దేశిత సమయానికి విమానాలను అందించడంలో హెచ్‌ఏఎల్ విఫలమవుతోందని, వాయుసేనకు ఉన్న అత్యవసర పరిస్థితి ఆ సంస్థలో కనిపించడం లేదని ఆరోపించారు.
తేజస్ ఎంకే-2 మొదటి విమాన ప్రయోగం అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చి, ప్రస్తుతం 2027 మధ్యకాలానికి మళ్లింది. ఈ నేపథ్యంలో భారత్ కేవలం స్వదేశీ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు వేచి చూడకుండా, అంతర్జాతీయ భాగస్వామ్యాల వైపు మొగ్గాలని ఎయిర్ మార్షల్ సూచించారు. యూరప్‌కు చెందిన ఎఫ్‌సీఏఎస్ (FCAS) లేదా జీసీఏపీ (GCAP) వంటి ప్రతిష్టాత్మక 6వ తరగతి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్‌లలో భారత్ భాగస్వామి కావాలని ఆయన గట్టిగా వాదించారు.
మరోవైపు, భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి స్వదేశీ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ 'ఏఎంసీఏ' (AMCA) నుంచి హెచ్‌ఏఎల్ సంస్థను తొలగించడం గమనార్హం. ఆర్థిక, పారిశ్రామిక అర్హతల ప్రాతిపదికన ప్రైవేట్ రంగ కంపెనీలకే ప్రాధాన్యం దక్కింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్&టీ-బీఈఎల్,భారత్ ఫోర్జ్-బీఈఎల్ కన్సార్టియమ్‌లు ఈ ప్రాజెక్ట్ రేసులో ముందుకు దూసుకెళ్లాయి.
మొత్తంగా చూస్తే, సరికొత్త సాంకేతికతతో కూడిన 5వ, 6వ తరగతి విమానాలను సమీకరించడంలో భారత్ వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రాబోయే దశాబ్దాల్లో గగనతల రక్షణ రంగంలో సాంకేతిక అంతరాలు ఏర్పడే ప్రమాదం ఉందని యుద్ధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. స్వదేశీ తయారీ అత్యంత కీలకమైనప్పటికీ, కాలానికి తగినట్లుగా వేగంగా స్పందించాల్సిన అవసరం సైతం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకైక ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ.రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వయంసమృద్ధ (ఆత్మనిర్భర్) దేశంగా మార్చడానికి, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా యుద్ధ విమానాలను తయారు చేయిస్తుంది. విదేశాల (రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల) నుండి యుద్ధ విమానాలను భారీ వ్యయంతో కొనుగోలు చేయడం కంటే, దేశీయంగానే సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం దీని ప్రధాన లక్ష్యం


