
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
భావ్ నగర్: దేశంలోని తొలి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దీంతో అహ్మదాబాద్ నుంచి ముంబైకి కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన తెలిపారు. అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా–పుణే ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం భావ్‌నగర్ టెర్మినస్‌లో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
ముంబై–అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమై, గుజరాత్‌లోని వాపి, సూరత్, ఆనంద్, వడోదర గుండా అహ్మదాబాద్‌కు వెళ్తుంది. గంటకు 320 కి.మీ. వేగంతో నడవనుంది. ఈ సందర్భంగా మంత్రి పలు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజక్టుల గురించి పంచుకున్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా అనేక కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లలో 34వేల కి.మీ.ల కొత్త రైల్వే ట్రాక్‌లను వేసింది, దేశంలో రోజుకు దాదాపు 12 కి.మీ కొత్త ట్రాక్‌లను నిర్మించిందని చెప్పారు. దేశంలో 1,300 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని, ఇది ఇంతకుముందెప్పుడూ చేయని పనని ఆయన కొనియాడారు.
ఈ క్రమంలో వస్తున్న సవాళ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దార్శనికతతో ప్రధాని మోదీ స్టేషన్ల పునరుద్ధరణ చేయిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించామని, వాటిలోనూ వందే భారత్‌వంటి సౌకర్యాలు కలి్పంచామని, అయినా ఛార్జీలు మాత్రమే తక్కువగానే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ రైళ్లను కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారని, వీటిలో ప్రయాణిస్తున్న వారు గొప్ప భావోద్వేగాలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.