breaking news
First Bullet Train
-
త్వరలో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు సేవలు
భావ్ నగర్: దేశంలోని తొలి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దీంతో అహ్మదాబాద్ నుంచి ముంబైకి కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన తెలిపారు. అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా–పుణే ఎక్స్‌ప్రెస్, జబల్పూర్–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం భావ్‌నగర్ టెర్మినస్‌లో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ముంబై–అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమై, గుజరాత్‌లోని వాపి, సూరత్, ఆనంద్, వడోదర గుండా అహ్మదాబాద్‌కు వెళ్తుంది. గంటకు 320 కి.మీ. వేగంతో నడవనుంది. ఈ సందర్భంగా మంత్రి పలు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజక్టుల గురించి పంచుకున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా అనేక కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లలో 34వేల కి.మీ.ల కొత్త రైల్వే ట్రాక్‌లను వేసింది, దేశంలో రోజుకు దాదాపు 12 కి.మీ కొత్త ట్రాక్‌లను నిర్మించిందని చెప్పారు. దేశంలో 1,300 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని, ఇది ఇంతకుముందెప్పుడూ చేయని పనని ఆయన కొనియాడారు. ఈ క్రమంలో వస్తున్న సవాళ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దార్శనికతతో ప్రధాని మోదీ స్టేషన్ల పునరుద్ధరణ చేయిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించామని, వాటిలోనూ వందే భారత్‌వంటి సౌకర్యాలు కలి్పంచామని, అయినా ఛార్జీలు మాత్రమే తక్కువగానే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ రైళ్లను కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారని, వీటిలో ప్రయాణిస్తున్న వారు గొప్ప భావోద్వేగాలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. -
500 కిలోమీటర్లు.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు!
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్రైలు 2023 నాటికి పట్టాలెక్కుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. భారత ఉపఖండ రైల్వేల్లో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య అండర్ సీ టన్నెల్ లో ఈ బుల్లెట్రైలు పరుగు తీయనుంది. దీని గరిష్ట వేగం 350 కి.మీ కాగా, నిర్వహణా వేగాన్ని 320 కి.మీకి తగ్గించారు. దీని ద్వారా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లోపు చేరుకోవచ్చు. నిర్మాణ పనులు 2018లో మొదలయ్యే అవకాశం ఉంది. రూ. 97,636 కోట్లతో ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించనున్నారు. ఇందులో 81 శాతం నిధులను జపాన్ నుంచి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ మొత్తాన్ని 0.1 శాతం వార్షిక వడ్డీతో 50 ఏళ్లలో తిరిగి చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను జపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) తయారు చేసిందని తెలిపారు. -
భారత్ బుల్లెట్ రైలుపై జపాన్ కన్ను!
టోక్యో: భారత్‌లో నిర్మించనున్న మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కాంట్రాక్ట్ తమకే దక్కుతుందని జపాన్ ఆశిస్తోంది. ఇప్పటికే ఇండోనేషియాలో నిర్మించతలపెట్టిన బుల్లెట్ రైలు కాంట్రాక్ట్ చైనా ఎగరేసుకుపోయిన నేపథ్యంలో భారత్ కాంట్రాక్టును చేజార్చుకోరాదని ఆ దేశం భావిస్తున్నట్టు నిక్కీ బిజినెస్ డైలీ మంగళవారం తెలిపింది. రూ. 98 వేల కోట్లతో చేపట్టనున్న భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ ఒక ట్రిలియన్ యెన్లు (రూ. 54వేల కోట్లు) రుణంగా ఇవ్వనుంది. ఇండోనేషియాలో నిర్మించనున్న తొలి బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 5 బిలియన్ డాలర్లు రుణం ఇచ్చేందుకు చైనా ముందుకురావడంతో ఆ ప్రాజెక్టుపై జపాన్ పెట్టుకున్న ఆశలు చేజారాయి. ఈ నేపథ్యంలో ఈ వారం భారత పర్యటనకు రానున్న జపాన్ ప్రధానమంత్రి షీన్జో అబె, ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఈ ఒప్పందంపై సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశముందని నిక్కీ తెలిపింది. ముంబై, అహ్మదాబాద్‌ను కలుపుతూ 505 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రెయిన్ కారిడార్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు అంచనా వేయాల్సిందిగా జపాన్ను భారత్ కోరింది. ఈ మేరకు పరిశీలన జరిపి.. ఇందుకు అవకాశముందని జపాన్ నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2017లో హైస్పీడ్ రైల్వే లింక్ నిర్మాణం ప్రారంభం కానుందని, 2023నాటికి ఇది పూర్తవుతుందని నిక్కీ తన కథనంలో వివరించింది.