
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు తగిన వ్యూహాన్ని రూపొందించేందుకు 24 పార్టీల ఇండియా కూటమి నేతలు ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, డీలిమిటేషన్ తదితర అంశాలపై అధికార ప్రభుత్వంతో చర్చించాలని వారు తీర్మానించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
INDIA bloc parties discuss key issues ahead of monsoon session of Parliament
Read @ANI Story | https://t.co/83WAD84ikS#INDIABloc #Parliament #MonsoonSession pic.twitter.com/yDCinNKDFB— ANI Digital (@ani_digital) July 19, 2025
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను ఘాటుగా తిప్పికొట్టకపోవడాన్ని ప్రతిపక్షం హైలైట్ చేస్తుందని ఇండియా కూటమి నేతలు తమ వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగా ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని కూడా పార్టీలు నిర్ణయించాయి . అలాగే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌ను కూడా లేవనెత్తాలని ప్రతిపక్ష నేతలు యోచిస్తున్నారు.
విలేకరులను ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మాట్లాడుతూ తమ కూటమి నేతలు ఎనిమిది ప్రాధాన్యతా అంశాలను ఈ జాబితాలో చేర్చారని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ దాడిలో పాల్గొన్న ముష్కరులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. భారత్-పాక్ మధ్య శాంతి స్థాపన చేసేందుకు.. తమ వాణిజ్య ఒప్పందాన్ని చర్చల కార్డుగా ఉపయోగించుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారని, దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని తాము సభలో ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ అంశాలపై చర్చించే సమయంలో ప్రధాని హాజరవుతారని తాము ఆశిస్తున్నామని తివారీ పేర్కొన్నారు. ఈ ప్రతిపక్షాల సమావేశంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఇండియా కూటమి పార్టీల పలువురు నేతలు పాల్గొన్నారు.