
న్యూఢిల్లీ: చైనా పాల్పడుతున్న భారత వ్యతిరేక ప్రచారంపై కేంద్రం కన్నెర్రజేసింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు గ్లోబల్ టైమ్స్, జిన్‌హువా పత్రికల ఎక్స్ ఖాతాలను నిషేధించింది. అవి రెండూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కరపత్రాల వంటివి. భారత ప్రభుత్వం ధ్రువీకరించని విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న చైనా మీడియాకు మన రాయబార కార్యాలయం గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది.
అయినా అదే ధోరణి కొనసాగడంతో తాజా చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మూడు భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇలా పచ్చి అబద్ధాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని, జర్నలిజం విలువలకు విరుద్ధమని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్–పాక్ ఉద్రిక్తతలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంపై ఆగ్రహించింది. అయితే గ్లోబల్ టైమ్స్‌పై నిషేధాన్ని బుధవారం అర్ధరాత్రి ఎత్తేసింది.