8న ఇండియా కూటమి పక్షాల భేటీ
15 విపక్ష పార్టీలు హాజరయ్యే అవకాశం
తొలిసారిగా టీవీకే పార్టీకి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో మరోమరు విపక్షాల ఐక్యత చాటేందుకు, కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు 8వ తేదీన హస్తినలో భేటీకానున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా మొత్తం 15 పార్టీల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, ప్రతిపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయడం భేటీ ప్రధాన లక్ష్యాలుగా తెలుస్తోంది.
ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, నిరుద్యోగం, ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, అంతర్జాతీయ పరిస్థితులు వంటి ప్రజా సమస్యలపై సంయుక్త పోరాటానికి భేటీలో వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర పరిణామాలు, వివిధ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. అయితే ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీల మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి.
ముఖ్యంగా రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వార్తలు రావడం కూటమిలో గందరోగళం నెలకొంది. ‘ఇండియా’ కూటమితో తెగదెంపులు చేసుకున్న ఆప్ పార్టీ ప్రతి పక్షాల కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. తమిళనాడు ఎన్నికల అనంతరం పరిణాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో తన బంధాన్ని తెంచుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది.
తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు తెగిపోయిన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలకు దూరంగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కొద్ది రోజుల కిందటే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి తమ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎంకే సమావేశానికి దూరంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో డీఎంకే స్థానంలో విజయ్ జోసెఫ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


