
హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు రెడ్‌అలర్ట్ అమల్లోనే ఉంటుందని అధికారులు ప్రకటించారు. మంగళూరు సిటీలో చాలా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. దక్షిణ కన్నడ జిల్లాలో కొండప్రాంతాల్లో స్వల్పస్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.
రెడ్ అలర్ట్ రాష్ట్రాలు: మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటక
ఆరెంజ్ అలర్ట్ రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.