సాక్షి,తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియల్ పొలిటీషియన్‌గా మారితే మంచిదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితువు పలికారు.
టీటీడీకి సప్లయి చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తుండడంపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘సిట్ రిపోర్టు వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోర్లు ఎందుకు మూత పడ్డాయి?. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంపైనే విషం చిమ్మిన నీచులు ఎల్లోగ్యాంగ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు చెంచాగా మారారు. సొంత పార్టీ నడుపుతున్నానన్న సంగతే మర్చిపోయారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చంద్రబాబు, పవన్ వ్యవహరించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతువుల కొవ్వు ఉందంటూ పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విష ప్రచారం చేయటం ధర్మమేనా?. అసలు శాంపిల్స్ తీసిన ట్యాంకర్లు వచ్చింది కూటమి ప్రభుత్వంలోనే.
చంద్రబాబు సీఎం అయిన నెల రోజుల తర్వాత వచ్చిన ట్యాంకర్లలో శాంపిల్స్ తీశారు.వాటిల్లో జంతువుల కొవ్వు కలవలేదని ల్యాబ్ రిపోర్టులే తేల్చాయి.అయినాసరే మాపై విషం చిమ్మటానికి ప్రయత్నించారు. వాస్తవాలేంటో సీబిఐ నిగ్గు తేల్చింది. అసలు హర్ష్ డైరీ పేరుతో బోలేబాబా ఎంటరైంది కూడా చంద్రబాబు హయాంలోనే.
చంద్రబాబు హిందూ ధర్మాన్ని కించపరిచారు. వైవీ సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన పేరు ఛార్జిషీటులో ఎందుకు లేదు?. చంద్రబాబుకు ఇప్పటికీ బుద్ది రాలేదు. లడ్డూకి మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేశారు. బీఆర్ నాయుడులాంటి నీచుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. కొండ మీద కూర్చుని పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. చివరికి కొందరు అధికారులు కూడా దైవం దగ్గర అపచారానికి పాల్పడుతున్నారు.
శ్యామలరావు, వెంకన్నచౌదరిలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే టైం దగ్గర్లోనే ఉంది.చంద్రబాబు మోజేతి నీళ్లు తాగుతూ ఇష్టానుసారం వ్యవహరించే వారిని వదిలిపెట్టేదే లేదు.లడ్డూ విషయంలో జనానికి వాస్తవాలు తెలిశాయి. సిట్ రిపోర్టు వచ్చాక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?.వాళ్ల నోర్లు ఎందుకు మూత పడ్డాయి?. పవన్ కళ్యాణ్ రియల్ పొలిటీషియన్‌గా మారితే మంచిది’అని సూచించారు.


