హాట్‌ టాపిక్‌గా మారిన సివిల్స్‌ టాపర్స్‌ విడాకులు

IAS toppers Tina Dabi Athar Khan file for divorce - Sakshi

'సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్‌ ప్రేమపక్షులు అథర్‌ ఆమిర్‌ ఉల్‌ షఫీఖాన్‌, టీనా దాబీ తమ వివాహ బంధంపై ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివాహమైన రెండేళ్లకే దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దాబీ భర్త షఫీఖాన్‌ జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో విడాకులను కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తామిద్దరి అంగీకారం మేరకే పిటిషన్‌ ఫైల్‌ చేసినట్లు శుక్రవారం తెలిపారు. 2015 సివిల్స్‌ టాపరైన టీనా దాబీ తన జూనియర్‌ అయిన అమీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్‌ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ వీరి పెళ్లికి మాత్రం పలు హిందూ సంఘాలు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి.

టీనా ఐఏఎస్‌ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వ హిందూ మహా సభ బహిరంగంగానే విమర్శించింది. అయినా అవేవి పట్టించుకుకోని ఈ జంట 2018లో అమీర్‌ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వివాహంతో ఒకటైయారు. పోస్టింగ్‌ అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం రాజస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉండటం అనుకోకుండా వచ్చిన అదృష్టంగా భావించారు. అయితే పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య అభిప్రాయ విభేదాలు రావడం ప్రారంభమయ్యాయి. చదవుకున్న యువతీ, యువకులు కావడంతో అర్థంచేసుకుని సర్ధుకుపోతారని ఇరువురి కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కాలం గుడుస్తున్న కొద్దీ మనస్పర్థాలు పెరగడంతో ఇక వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది.

అయితే కులాలు, మతాలను కాదని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయకుండా వివాహ బంధంతో ఒకటైన జంట తాజాగా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2015 సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే భోపాల్‌కు చెందిన టీనా దబి మొదటి ర్యాంకు సాధించగా.. అదే పరీక్షలో కశ్మీర్‌కు చెందిన అథల్‌ ఆమీర్‌ రెండో ర్యాంకు సాధించారు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారగా.. ఇప్పుడు విడాకుల వార్త కూడా అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లవ్‌ జిహాద్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చసాగుతున్న తరుణంలో వీరు విడాకులు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. హిందు మతానికి చెందిన యువతులకు ముస్లిం యువకులు గాలం వేసి మోసపూరితంగా వివాహం చేసుకుంటున్నారని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top