పెరరివాళన్‌.. ఇప్పటికే ఆలస్యమైంది.. పెళ్లి చేసుకో

I Wish Perarivalan Gets Married And Leads Happy Life: Justice KT Thomas - Sakshi

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కేటీ థామస్

చెన్నై: సుదీర్ఘ కారాగారవాసం తర్వాత జీవితఖైదీ ఏజీ పెరరివాళన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైన పెరరివాళన్‌ను తాను కలవాలనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ చెప్పారు. అతడు సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. 1999లో ఏజీ పెరరివాళన్‌కు మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి జస్టిస్ కేటీ థామస్ నేతృత్వం వహించారు. 


‘పెరరివాళన్‌ను నేను చూడాలనుకుంటున్నాను. మీకు సమయం దొరికితే, దయచేసి నన్ను కలవండి’ అంటూ కేరళలోని కొట్టాయంలో ఉన్న తన నివాసం నుంచి ఆయన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’తో మాట్లాడారు. ‘సుదీర్ఘ కారాగారవాసం తర్వాత 50 సంవత్సరాల వయస్సులో జైలు నుంచి విడుదలైన అతడితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అతను త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రేమను మాత్రమే పొందాడు. వైవాహిక జీవితాన్ని అతడు గడపలేదు. తన ప్రియమైన వారితో అతడు సంతోషంగా జీవించాలి. పెరరివాళన్‌ను జైలు నుంచి బయటకు తీసువచ్చిన ఘనత అతడి తల్లి (అర్పుతం అమ్మాల్)కి దక్కుతుంది. ఈ ఘనతకు ఆమె సంపూర్ణంగా అర్హురాల’ని జస్టిస్‌ కేటీ థామస్ పేర్కొన్నారు. (చదవండి: ఇది అమ్మ విజయం, పెరారివాలన్‌ భావోద్వేగం)


రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు 23 ఏళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేయాలన్న నిర్ణయాన్ని 2013లో జస్టిస్‌ కేటీ థామస్ వ్యతిరేకించారు. దీంతో 2014లో ముగ్గురు దోషుల మరణశిక్షలను మారుస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడిపిన వారిని ఉరితీయడం అంటే ఒక నేరానికి రెండు శిక్షలు అమలు చేసినట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన గట్టిగా వాదించారు. అంతేకాదు దోషుల పట్ల ఉదారత చూపాలని అప్పట్లో సోనియా గాంధీని వేడుకున్నారు. దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు మంత్రివర్గ ప్రతిపాదనను గవర్నర్‌ పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు.  

యావజ్జీవ కారాగార శిక్ష మొత్తం జీవితకాలానికి సంబంధించిదైనప్పటికీ.. భారత రాజ్యాంగం ఉపశమనాన్ని అనుమతిస్తుంది అని జస్టిస్‌ థామస్ అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో గోపాల్ గాడ్సేకు 14 సంవత్సరాల తర్వాత ఉపశమనం లభించిందని.. అతనితో పాటు జీవిత ఖైదులో ఉన్న ఇతర దోషులందరినీ కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ‘జైలు నుంచి విడుదలైన తర్వాత గోపాల్ గాడ్సే జీవితాన్ని చూడండి. అతడు పూర్తిగా మారిపోయాడు. పుస్తకాలు కూడా రాశాడు. మహాత్మా గాంధీ హంతకులను విడుదల చేసి.. వారిలో పరివర్తన తేవడానికి అనుమతించారు. మరి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను ఎందుకు సంస్కరించకూడద’ని థామస్ ప్రశ్నించారు. పెరరివాళన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మిగిలిన ఆరుగురు దోషులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. (చదవండి: పెరరివాళన్‌ పెళ్లి ఏర్పాట్లు షురూ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top