Rajiv Gandhi Assassination Case: పేరరివాళన్‌ పెళ్లి ఏర్పాట్లు షురూ

Rajiv Assassination Convict Perarivalan Mother Planning his Wedding - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌కు సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం లభించిన విముక్తి.. మిగిలిన ఆరుగురినీ ఆశలపల్లకి ఎక్కించింది. సీఎం స్టాలిన్‌ సైతం ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తామని ప్రకటించడం వారి విడుదలపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.  

పెళ్లి ఏర్పాట్లు చేస్తాం: అర్బుదమ్మాళ్‌
1991 మే 21వ తేదీ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు గురికాగా, జూన్‌లో పేరరివాలన్‌ను అరెస్ట్‌ చేసినప్పటి నుంచి విడుదల కోసం తల్లి అర్బుదమ్మాల్‌ పోరాటం చేస్తున్నారు. తన కుమారుడు నిరపరాది అంటూ ఆనాటి నుంచి వరుసగా అందరు సీఎంలకు, అన్నిపార్టీల నేతలకు ఆమె వినతిపత్రాలు సమర్పించారు. పేరరివాలన్‌ విడుదలైన వెంటనే వివాహం చేసి పెట్టాలని ఆమె ఆశపడింది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

చదవండి: (బిడ్డకోసం అమ్మ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, తీవ్ర భావోద్వేగం)

నేపథ్యం ఇదీ.. 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూరులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ బహిరంగసభకు హాజరైనప్పుడు ఎల్‌టీటీఈ మానవబాంబు చేతిలో హతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి 1999లో తొమ్మిది మంది విడుదల కాగా, పేరరివాళన్, నళిని, మురుగన్, శాంతన్‌కు ఉరిశిక్ష, రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్‌ పయస్‌కు యావజ్జీవశిక్ష పడింది. 2014లో పేరరివాళన్‌ సహా అందరూ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం పంపగా పరిశీలనలోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ సుప్రీంకోర్టు వారందరి మరణశిక్షను రద్దు చేసి యావజ్జీవశిక్షకు తగ్గించింది.

ఆనాటి నుంచీ వారంతా తమిళనాడు రాష్ట్రం వేలూరు సెంట్రల్‌ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. మానవబాంబుకు బ్యాటరీ కొనుగోలు చేసి ఇచ్చిన నేరంపై పేరరివాళన్‌కు శిక్ష పడగా  విడుదల చేయాలని కోరుతూ అతని న్యాయవాది 2016లో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేశారు. మరో పిటిషన్‌ ఆధారంగా పేరరివాళన్‌కు సుప్రీంకోర్టు జామీను మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, మొత్తం ఏడుగురినీ విడుదల చేయాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా, గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి పరిశీలనకు చేరింది. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి మాత్రమే నిర్ణయం తీసుకోగలరని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు బెంచ్‌ తోసిపుచ్చింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top