Perarivalan: ఇది అమ్మ విజయం, పెరారివాలన్‌ భావోద్వేగం

Victory of my mother struggle: AG Perarivalan after SC Verdict - Sakshi

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన  ఆదేశాలు జారీ చేసింది. ఈ  కేసులో ఏడుగురు దోషుల్లో ఒకరు,  యావజ్జీవ ఖైదీ.. ఏజీ పెరారివాలన్‌ అలియాస్‌ అరివును విడుదల చేయాలని సుప్రీం మే 18న ఆదేశించింది. 19 ఏళ్ల వయసులో  అరెస్టయ్యి, గత  మూడు దశాబ్దాలుగా  జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల వయసులో పెరారివాలన్‌ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. దీంతో ఆయన తల్లి అర్పుతం అమ్మాళ్ ఆనంధానికి అవధుల్లేవు. తన బిడ్డ అమాయకుడు అని వాదిస్తూ, ఏళ్ల తరబడి ఆమె చేసిన పోరాటం అంత తేలికైనదేమీ కాదు. ఎన్ని అవమానాలు, అడ్డంకులు ఎదురైనా పట్టువదలకుండా, న్యాయవ్యవస్థమీద విశ్వాసాన్ని కోల్పోకుండా పోరాడి విజయం సాధించిన గొప్ప తల్లి ఆమె. అందుకే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఆ మహాతల్లికి స్వర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ట్విటర్‌లో ఆమెకు ఏకంగా  21.3 వేల ఫాలోవర్స్‌ ఉండటం  గమనార్హం. 

ఆపదలో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కన్నతల్లి ఎంతటి త్యాగానికైనా, సాహసానికైనా వెరువదు అనేందుకు పెరారివాలన్‌ తల్లి నిలువెత్తు నిదర్శనం. అవమానాలు, అవహేళనలు ఎదురైనా, ఎన్నిసార్లు కోర్టులో నిరాశ ఎదురైనా వెన్ను చూపలేదు. ఆశ కోల్పోలేదు. ఆమెది ఒకటే లక్ష్యం. అన్యాయంగా  జైల్లో మగ్గుతున్న తన కుమారుడికి విముక్తి లభించాలి. అందుకోసం ఏకంగా మూడు దశాబ్దాలుగా అంతులేని పోరాటం చేసేంది. అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులకు  పలుసార్లు అభ్యర్థనలు పెట్టింది.

ఈ సుదీర్ఘ పోరులో తనతో  కలిసి వచ్చిన వారందరినీ కలుపుకుపోయారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టు కున్నారు. కుటుంబ సభ్యులు, తమిళ సోదరులు, ఇతర మిత్రుల సహకారంతో చివరికి అపూర్వ విజయం సాధించారు. అందుకే కోర్టు  తీర్పు వెలువడిన వెంటనే ఆనందంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.  ఉత్సాహంగా  మిత్రులకు, బంధువులకు స్వీట్లు పంచిపెట్టారు. 

మరణశిక్షనుంచి యావజ్జీవ శిక్షగా, ఇపుడు జైలునుంచి విడుదలయ్యే దాకా అర్పుతం అమ్మాళ్‌ చేసిన పోరాటం అభినందనీయంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా పెరారివాలన్ తల్లి  అమ్మాళ్‌ మీడియాతో​ మాట్లాడారు. “మీ అందరినీ  వెయిట్‌ చేయించినందుకు క్షమాపణలు కోరుతున్నాను, కానీ నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. మా పోరాటం 30 ఏళ్లు సాగింది. ఇంతకాలం మమ్మల్ని ఆదరించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఇతర ముఖ్యులు అందరికీ కృతజ్ఞతలు.  అసలు నేను ఎవరో తెలియని వారుకూడా అండగా నిలిచారు’’ అంటూ అందరికీ నీరు నిండిన కళ్లతో ధన్యవాదాలు తెలిపారు. అలాగే 30 ఏళ్లు జైలులో గడపడం ఎలా ఉంటుందో అందరూ ఒక్క నిమిషం ఆలోచించాలని అర్పుతం అమ్మాళ్‌  కోరారు.

సుప్రీం తీర్పు తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన పెరారివాలన్,  ‘‘తన సొంత కుటుంబ సభ్యుడిగా భావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు నాకు సంఘీభావంగా నిలిచారు.  తన కోసం 30 సంవత్సరాలు పోరాడింది అమ్మ.  ఈ ఘనత అమ్మదే.  ముఖ్యంగా  ప్రారంభంలో  అక్కలు  నాన్న, బావమరిది ప్రేమే నన్ను ముందుకు నడిపించాయి’’.  ఈ పోరాట క్రమంలో ఓడిపోయిన ప్రతీసారి, అమ్మ శక్తిని హరించి వేస్తున్నంత బాధ కలిగేదని గుర్తుచేసుకున్నారు. అసలు తన మొఖం చూడాలంటేనే భయపడేవాడినని చెప్పారు  కానీ వాళ్లంతా బతికి ఉండగానే తనకు విముక్తి లభిస్తుందని  మాత్రం ఎప్పుడూ ఆశించానంటూ భావోద్వేగానికి లోనయ్యారు పెరారి.  కాగా  జైలులో ఉన్న సమయంలో పెరారి అనేక విద్యా అర్హతలను సంపాదిండమే కాదు ఒక పుస్తకాన్ని  రాశారు.

ఈ సుదీర్ఘ పయనంలో తన పెద్ద అక్కతో  సహా, తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కిరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మరణశిక్షను నిరసిస్తూ కాంచీపురానికి చెందిన 20 ఏళ్ల మహిళ సెంకోడి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.  మాజీ ప్రధానమంత్రులకు తన కోసం రాసిన అనేక లేఖలు , మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ సిబిఐ అధికారి విత్యాగరాజన్‌, జస్టిస్ కృష్ణయ్యర్‌, రిటైర్డ్ జస్టిస్‌ కెటి థామస్, ఫీజు కూడా ఆశించకుండా అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్, ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం, జైలు అధికారులు ఇలా ఎందరో తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. మీడియా సపోర్ట్‌ కూడా చాలా ఉందన్నారు. తాను మరణ శిక్షలకు వ్యతిరేకమని పెరారివాలన్‌  మీడియాతో చెప్పారు.  మరోవైపు స్వయంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌  అర్పుతం అమ్మాళ్‌కు ఫోన్‌ చేసి మరీ ‍ ప్రత్యేకంగా అభినందించారు.  కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కాగా భారతమాజీ ప్రధాని,  రాజీవ్ గాంధీ మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో,  అప్పటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జికె మూపనార్‌తో కలిసి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆత్మాహుతి బాంబర్ ధను అలియాస్ తేన్మొళి రాజారత్నం  చేసిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాజీవ్‌ను హత్య చేసేందుకు వినియోగించిన బెల్ట్ బాంబు బ్యాటరీని కొనుగోలు చేసినట్లు పెరారివారన్‌పై ప్రధాన ఆరోపణలు. ఈ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈకి చెందిన శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడనేది అభియోగం. ఆ సమయంలో పెరారి వాలన్ వయసు 19 సంవత్సరాలు. ఈ కేసుకు సంబంధించి 1998లో పెరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది. ఆ తరువాత 2014లో పెరారివాలన్, మురుగన్, సంతన్ క్షమాభిక్ష పిటిషన్‌లు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న కారణంగా దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.    

రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం విడుదల చేయాలని కోరుతూ డిసెంబర్ 31, 2015న, పెరారివాలన్ 47 పేజీలు,  సీడీలతో కూడిన  క్షమాభిక్ష పిటిషన్‌ను తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అందించారు. అనంతరం పెరారివాలన్‌, ఇతర దోషులకు క్షమాపణ ఇవ్వాలని పళనిస్వామి నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం  2018లో గవర్నర్‌ను కోరింది. గవర్నర్ ఈ విషయాన్ని భారత రాష్ట్రపతికి  నివేదించారు.  ఫలితంగా పెరారివాలన్‌‌కు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

తాజాగా పెరారివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. బ్యాటరీలను కొనుగోలు చేసిన ఉద్దేశ్యం, రాజీవ్‌ హత్యకుట్ర కోణం తనకు తెలియదని పెరారి వాదన. అలాగే అక్టోబరు 27, 2017 నాటి అఫిడవిట్‌లో  పెరారివాలన్ చేసిన ప్రకటనను తాను రికార్డ్ చేయలేదని మాజీ  సీబీఐ అధికారి త్యాగరాజన్‌ అంగీకరించారు. అంతేకాదు రెండు దశాబ్దాల తన జీవితంలో జరిగిన నష్టానికి  తాను పశ్చాత్తాప పడుతున్నానని కూడా అని త్యాగరాజన్ చెప్పారు.

మరోవైపు రాజీవ్ గాంధీ 31వ వర్ధంతికి కేవలం మూడు రోజుల ముందు (మే 18, బుధవారం)  పెరారివాలన్‌కు విముక్తి లభించడం విశేషం.  తాజా  తీర్పుతో  ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమం కానుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయం బాధించింది : కాంగ్రెస్‌ 
పెరారివాలన్‌ విడుదలపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేసింది. టెర్రరిస్టును టెర్రరిస్టుగానే పరిగణించాలి, సుప్రీం ఆదేశాలు తీవ్ర బాధను కలిగించాయని  కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. మరోవైపు  రాజీవ్‌ భార్య, కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ,   కాంగ్రెస్‌ నేతలు, రాజీవ్‌ కుమార్తె ప్రియాంక గాంధీ,  కుమారుడు రాహుల్‌ గాంధీ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top