కరోనా వ్యాక్సిన్‌ : మరుసటి రోజే విషాదం

 UP Hospital Worker Dies Official Says Unrelated To Vaccine - Sakshi

కరోనా వ్యాక్సిన్‌ తీసుకొన్న 24 గంటలకు యూపీలో విషాదం

కోవిడ్‌ టీకా తీసుకున్న  మరుసటి రోజే వార్డ్‌బాయ్‌ కన్నుమూత

సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణకుగాను ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. టీకా తీసుకున్న  మరుసటి రోజే  ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి  కన్నుమూసిన ఉదంతం  ఆందోళన రేపుతోంది. 

శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొరాదాబాద్‌కు చెందిన వార్డ్ బాయ్ మహిపాల్ సింగ్(46) శనివారం మధ్యాహ్నం కోవిడ్ వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. 24 గంటల తరువాత ఛాతీలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలతో ఆదివారం సాయంత్రం ఆయన మరణించారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకోడానికిముందే మహిపాల్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యూమోనియా, సాధారణ జలుబు,దగ్గు లాంటి స్వల్ప లక్షణాలతో  తన తండ్రి బాధపడుతున్నారని  మహీపాల్ సింగ్ కుమారుడు విశాల్ మీడియాతో అన్నారు. శ‌నివారం వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల స‌మ‌యంలో తానే ఆయనను ఇంటికి తీసుకు వ‌చ్చానని, కానీ ఆ తరువాత మరింత అనారోగ్యానికి గురయ్యాడని, ఛాతిలో నొప్పి,  ఊపిరి ఆడక ఆయన చనిపోయారని తెలిపారు.

అయితే మహిపాల్ మరణానికి, టీకాకు సంబంధం లేదని భావిస్తున్నామని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసీ గార్గ్ వెల్లడించారు. మరణానికి కారణాలను పరిశీలిస్తున్నామన్నారు. "కార్డియో-పల్మనరీ డిసీజ్" కారణంగా "కార్డియోజెనిక్ షాక్ లేదా సెప్టిసెమిక్ షాక్" తో చనిపోయినట్టుగా పోస్ట్మార్టం నివేదిక ద్వారా తెలుస్తోందని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కోవిడ్ టీకా డ్రైవ్ మొదటి రోజు శనివారం 22,643 మందికి టీకాలు వేసినట్లు యోగి సర్కార్‌ తెలిపింది.  రాష్ట్రంలో రెండవ విడత టీకా కార్యక్రమం జనవరి 22, శుక్రవారం ఉంటుందని వెల్లడించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top