హోలీ, డోలోత్సవం రద్దు

Holi, Dolotsavam Celebrations Cancelled In Odisha - Sakshi

భువనేశ్వర్‌: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామూహికంగా నిర్వహించుకునే హోలీ, డోలోత్సవం వేడుకల్ని రద్దు చేసిననట్లు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్‌ (ఎస్సార్సీ) ప్రదీప్‌ కుమార్‌ జెనా తెలిపారు. హోలీ పండగను పురస్కరించుకుని ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. కోవిడ్‌ నిబంధనల కార్యాచరణతో ఆలయాల్లో సేవాదుల నిర్వహణ యథాతథంగా కొనసాగుతుంది. కుటుంబీకులతో కలిసి ఇంటిలో హోలీ పండగ జరుపుకునేందుకు అడ్డంకి లేదు. బహిరంగ ప్రదేశాలు, ప్రాంగణాల్లో సామూహిక హోలీ వేడుకల్లో పాలుపంచుకునే వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 కింద చర్యలు చేపడతామని ఎస్సార్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసి హెచ్చరించారు. అక్కడక్కడ కనిపిస్తున్న సార్స్‌–కోవ్‌ 2 ఛాయలు రాష్ట్రంలో కలవరం రేపుతున్నాయి. సంక్రమణ నివారణ కోసం కోవిడ్‌ – 19 నిబంధనల ఆచరణతో జాగ్రత్తతో  మసలుకోవాలని ఎస్సార్సీ సూచించారు.  

కలెక్టర్‌ ఉత్తర్వులతో భక్తుల అనుమతి
స్థానిక పరిస్థితుల  దృష్ట్యా కలెక్టర్లు, మునిసిపల్‌ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆలయాలు, దేవస్థానాలు, ప్రార్థన మందిరాలు, ధార్మిక ప్రాంగణాల పరిసరాలకు సాధారణ ప్రజానీకం, భక్తుల్ని అనుమతిస్తారు. బ్రెజిల్‌. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌ వంటి ప్రపంచ దేశాలతో పాటు మహరాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మలి దశ కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. హోలీ, డోలోత్సవం దగ్గర పడుతున్నాయి. ఈ పండగలను పురస్కరించుకుని ప్రజలు గుంపుగా చేరుతారు. ఉమ్మడిగా రంగులు చల్లుకుని వేడుక జరుపుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్‌ – 19 నిబంధనల కార్యాచరణ అసాధ్యం. కోవిడ్‌ సంక్రమణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల సామూహిక నిర్వహణను నివారించినట్లు ఎస్సార్సీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

డోలోత్సవంపై బీఎంసీ నిఘా 
హోలీ పండగ బహిరంగ వేడుకల నివారణ నేపథ్యంలో ప్రత్యేక సహాయ కమిషనర్‌ జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో భువనేశ్వర్‌ నగర పాలక సంస్థ (బీఎంసీ) తాజా ఆదేశాలు జారీ చేసింది. హోలీ పండగ నేపథ్యంలో నిర్వహించే డోలోత్సవంపట్ల బీఎంసీ ప్రత్యేకంగా నిఘా వేస్తుందని పేర్కొంది. డోలోత్సవంలో భాగంగా పలు ఆలయాల నుంచి ఉత్సవ మూర్తుల్ని బహిరంగ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక భేటీ ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా లెక్కకు మిక్కిలిగా ప్రజలు గుమి గూడి రంగులు చల్లుకుని వేడుకలు జరుపుకోవడం ఆచారం. ఈ ఏడాది కరోనా సంక్రమణ నేపథ్యంలో ఈ కార్యక్రమంపట్ల భువనేశ్వర్‌ నగర పాలక సంస్థ ఆంక్షలు జారీ చేసింది. ఉత్సవ మూర్తుల్ని పల్లకిలో తీసుకుని వచ్చే సందర్భంగా ఒక్కో పల్లకితో అత్యధికంగా 6గురు వ్యక్తుల్ని మాత్రమే అనుమతిస్తారని బీఎంసీ   కమిషనర్‌ ప్రేమ చంద్ర చౌదరి తెలిపారు. డోలోత్సవం నిర్వహణకు బహిరంగ ప్రాంతంలో అత్యధికంగా 50 నుంచి 60 మంది వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తారని ప్రకటించారు. ఈ మేరకు నిర్వాహకులు ముందస్తుగా దరఖాస్తు దాఖలు చేసి అనుమతి పొందడం అనివార్యంగా పేర్కొన్నారు. 

చదవండి: దారుణం: నిద్రలేపి నుదుటిపై తుపాకీతో...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top